Dharani
Khammam Car Accident Mystery Solved: రెండు నెలల క్రితం చోటు చేసుకున్న కారు యాక్సిడెంట్ కేసు మిస్టరీని పోలీసులు పరిష్కరించారు. సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
Khammam Car Accident Mystery Solved: రెండు నెలల క్రితం చోటు చేసుకున్న కారు యాక్సిడెంట్ కేసు మిస్టరీని పోలీసులు పరిష్కరించారు. సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
Dharani
నేడు సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలకు డ్రగ్స్, మద్యంతో పాటుగా వివాహేతర సంబంధాలు కూడా కారణం అవుతున్నాయి. తాత్కలిక సుఖం కోసం.. కట్టుకున్న వారిని.. కడుపున పుట్టిన వారిని సైతం కడతేరుస్తున్నారు. తప్పించుకోలేమని తెలిసి కూడా తప్పుదోవలో నడుస్తున్నారు. విద్యావంతులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తోన్న వారు సైతం ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం విషాదకరం. తాజాగా ఖమ్మంలో చోటు చేసుకున్న ప్రమాదం వెనక కూడా వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
సుమారు రెండు నెలల క్రితం అనగా.. మే 28న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యతండా గ్రామం సమీపంలో జరిగిన కారు ప్రమాదం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అది ప్రమాదమా లేదా చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారా అన్న అనుమానాలు తెర మీదకు రాగా.. పోలీసుల దర్యాప్తులో చివరికి మిస్టరీ వీడింది. ఇది కారు ప్రమాదం కాదని.. పక్కాగా ప్లాన్ చేసిన హత్య చేశారని పోలీసులు తేల్చారు. ఆ వివరాలు..
నర్సుతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి భార్య, బిడ్డలు అడ్డుగా ఉన్నారని భావించిన డాక్టర్.. తనకు ఉన్న విషయ, వైద్య పరిజ్ఞానంతో ముగ్గురిని హత్య చేశాడు. ఈ దారుణంలో నిందితుడి భార్యకు ఉన్న అనారోగ్య సమస్య అతడికి కలిసి వచ్చింది. చికిత్స పేరిట భార్యకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చిన ఆ దుర్మార్గ వైద్యుడు ..ఆపై ఇద్దరు చిన్నారుల ముక్కు, నోరు మూసి చంపేశాడు. ఆ తర్వాత వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అందరని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ మృతురాలి తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో.. మిస్టరీ వీడింది.
ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం బావోజితండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య కుమారి, నాలుగేళ్ల లోపు కుమార్తెలు క్రుషిక, కృతిక ఉన్నారు. ఈ క్రమంలో అతడికి కేరళకు చెందిన ఓ నర్స్‌తో పరిచయం ఏర్పడి.. చివరకు అది కాస్త వివాహేతర బంధంగా మారింది. అయితే వీరి బంధం గురించి ప్రవీణ్ భార్య.. కుమారికి తెలిసి.. నిలదీసింది. ఇరు వైపుల తల్లిదండ్రులకు ప్రవీణ్ చేస్తోన్న పని గురించి చెప్పింది. దాంతో ఇద్దరి తల్లిదండ్రులు.. హైదరాబాద్‌కు వచ్చి.. ఇరువురికి అనేక సార్లు నచ్చచెప్పారు. అంతేకాక.. ప్రవీణ్‌ను ఖమ్మం వచ్చి.. అక్కడే డాక్టర్‌గా పని చేయమని సూచించారు.
కానీ తల్లిదండ్రులు, అత్తమామల మాటలు పట్టించుకోని ప్రవీణ్.. తన బంధానికి భార్యాబిడ్డలు అడ్డంకిగా ఉన్నారని.. వారిని అడ్డు తప్పిస్తే.. ఇక తనకు ఇబ్బంది ఉండదని భావించాడు. దానిలో భాగంగా.. మే నెలలో భార్యాపిల్లలను తీసుకుని స్వగ్రామమైన బావోజీ తండాకు వచ్చాడు. ఇక సొంతూరికి వచ్చాక.. భార్య కుమారి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పుకొచ్చింది. ఆమెను అడ్డు తప్పించుకోవాలని చూస్తోన్న ప్రవీణ్.. ఇదే మంచి అవకాశంగా భావించాడు. కుమారికి చికిత్స పేరిట మే 27న ఇంజక్షన్ వేశాడు. ఆ తర్వాత ఆధార్ కార్డులో తప్పులు సరిదిద్దేందుకు కారులో వెళ్లి వస్తుండగా 28న కూడా ఆమె అనారోగ్యంగా ఉంది అనడంతో.. చికిత్స కోసం.. అంతకు ముందు వేసిన ఇంజక్షన్‌తో పాటు అప్పటికే కారులో దాచిన మత్తు మందు హైడోస్ కలిపి ఇచ్చాడు. దీంతో భార్య కుమారి స్పృహ కోల్పోయి కన్నుమూసింది.
అయితే భార్య కుమారికి ఇంజక్షన్ వేసిన విషయాన్ని పిల్లలు చూడడంతో.. వారు నోరు తెరిస్తే.. తనకు ప్రమాదం అని భావించిన ప్రవీణ్.. ఆఖరికి కన్న బిడ్డలను కూడా హతమార్చాలని భావించాడు. దాంతో వారి ముక్కు, గొంతు మూసి హత్య చేశాడు. ముగ్గురూ చనిపోయారని నిర్ధారించుకున్న ప్రవీణ్ కారును తీసుకెళ్లి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు.
అయితే ఈ ప్రమాదంలో భార్య, బిడ్డలు మృతి చెందగా.. ప్రవీణ్‌కు స్వల్పగాయాలు కావడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కుమారి తల్లిదండ్రులు.. ఘటనాస్థలికి చేరుకుని.. అల్లుడి గురించి ముందే తెలియడంతో అతనే చంపేశాడని అనుమానిస్తూ ఆందోళన చేయడమే కాక పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఘటన తర్వాత అంత్యక్రియలకు హాజరైన ప్రవీణ్ ఆ తర్వాత ముఖం చాటేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.
ఈ ఘటనపై తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకు ఎదురు చూశారు. అందులో కుమారి శరీరంలో మత్తు మందు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపై కారులో ప్రవీణ్ ఉపయోగించిన ఇంజక్షన్ నీడిల్ లభించగా మత్తుమందు ఆనవాళ్లు కనిపించాయి. ఏ మత్తు మందు వాడితే శరీరంపై ఎంతసేపు ప్రభావం ఉంటుందనే వివరాలను ప్రవీణ్ గూగుల్‌లో వెతికినట్లు అతడి గూగుల్ హిస్టరీ ద్వారా గుర్తించారు.
దాంతో నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ప్రవీణ్‌తో పాటు హత్యకు ప్రేరేపించిన అతని ప్రియురాలు నర్స్.. సోనీ ఫ్రాన్సిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.