విప్లవ కవి, ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గతించి కాలం గడుస్తూ పోతున్నా ప్రజలు మరువలేకపోతున్నారు. మేధావిగా, కవిగా, రాజకీయవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోనూ గద్దర్ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాళ్లకు గజ్జ కట్టి ఆడి, పాడిన గద్దర్ ఎంతోమంది బాధిత ప్రజల్ని ఓదార్చారు. ‘మా భూమి’ సినిమాలో ‘బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి..’ పాటతో తెలంగాణ ప్రజల్ని ఒక్కసారిగా కదిలించారాయన.
గద్దర్ పోరాటాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. జన నాట్య మండలి ద్వారా ఆట, పాటలతో జనాలకు ఆయన చేరువయ్యారు. అణచివేత, అసమానతలు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన గళం వినిపించేది. అలాంటి గద్దర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇక, గద్దర్ భార్య గుమ్మడి విమలకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరామర్శ లేఖ రాశారు. ఆయన మృతి గురించి తెలుసుకొని తాను చాలా బాధపడ్డానని అన్నారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబ సభ్యులకు తాను హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆ లెటర్లో మోడీ పేర్కొన్నారు.
గద్దర్ ఆలపించిన పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించాయని పరామర్శ లేఖలో రాసుకొచ్చారు ప్రధాని మోడీ. ఆయన రచనలు ప్రజలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించాయని.. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో గద్దర్ చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మోడీ. ఇక, అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 6న గద్దర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మూత్ర సమస్యలు, ఊపిరితిత్తులు, వయసు సంబంధిత కారణాలతో ఆయన మరణించారు.