చనిపోయిన పెంపుడు కుక్కు.. సమాధి కట్టి పెద్దకర్మ చేసిన యజమాని

మన కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరుపుతుంటాము. ఇక ఆనాటి నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం.. చనిపోయిన వ్యక్తికి సమాధి కడుతుంటారు. దీంతో పాటు వారం రోజులకో లేదంటే పది రోజులకే పెద్దకర్మ చేస్తుంటారు. ఇది చాలా ఏళ్లనుంచి వస్తున్న ఆనవాయితి. కానీ, మూగ జీవులు చనిపోతే సమాధి కట్టి పెద్దకర్మ చేయడం మీరెక్కడైనా చూశారా? కానీ, మహబూబాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తి ఇలాగే చేసి చనిపోయిన కుక్క పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

అది తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామం. ఇక్కడే రాచర్ల వీరన్న-మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. వీరన్న గత ఆరేళ్ల నుంచి ఎంతో ప్రేమగా ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. దీనికి జాకీ అని పేరు కూడా పెట్టాడు. అయితే, ఇన్ని రోజులు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఈ శునకం.. 10 రోజుల కిందట అనారోగ్యంతో మరణించింది. ప్రాణంగా పెంచుకున్న జాకీ చనిపోవడంతో ఈ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత ఇంటి దగ్గరలోనే ఆ శునకానికి అంత్యక్రియలు జరిపారు.

ఇదిలా ఉంటే.. వీరన్న మనుషులకు చేసిన విధంగానే తన పెంపుడు కుక్కకు కూడా సమాధి కట్టించి పెద్దకర్మ చేయాలని అనుకున్నాడు. ఇక అతడు అనుకున్నదే ఆలస్యం.. ఆ జాకీ పేరు మీద సమాధి కట్టి ఇటీవల పెద్ద కర్మ కూడా చేశాడు. ఈ కార్యక్రమంలో వీరన్న దంపతులు వారి బంధువులందరినీ పిలిచి చికెన్ తో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కుక్కపై అతనికున్న ప్రేమను చూసి బంధువులు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ జాకీ సమాధి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఈ రోజునుంచే వారి అకౌంట్లలోకి రూ. లక్ష!

Show comments