iDreamPost
android-app
ios-app

2 Bedroom House: సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. రూ.4 లక్షల్లోనే డబుల్‌ బెడ్రూం ఇల్లు

  • Published Aug 17, 2024 | 11:20 PM Updated Updated Aug 17, 2024 | 11:20 PM

NIRD-Double Bedroom House In Rs 4 Lakhs: మీరు కూడా సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా.. అయితే మీ కోసమే ఈ బంపరాఫర్‌. కేవలం 4 నాలుగు లక్షల్లోనే డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకోవచ్చు. ఎలా అంటే..

NIRD-Double Bedroom House In Rs 4 Lakhs: మీరు కూడా సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా.. అయితే మీ కోసమే ఈ బంపరాఫర్‌. కేవలం 4 నాలుగు లక్షల్లోనే డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకోవచ్చు. ఎలా అంటే..

  • Published Aug 17, 2024 | 11:20 PMUpdated Aug 17, 2024 | 11:20 PM
2 Bedroom House: సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. రూ.4 లక్షల్లోనే డబుల్‌ బెడ్రూం ఇల్లు

పేద, ధనిక అనే బేధాలు లేకుండా ప్రతి మనిషికి ఉండే అతి సామాన్యమైన కోరిక సొంతింటి నిర్మాణం. చనిపోయేలోపు తనది అని చెప్పుకునే ఓ గూడు నిర్మించుకోవాలని ప్రతి మనిషి ఆశపడతాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రామాల్లోనే ఎంతో సింపుల్‌గా ఇల్లు కట్టుకోవాలన్నా.. తక్కువలో తక్కువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే నగరాల్లో అయితే అరకోటి పెట్టంది ఇల్లు రాదు. నేటి కాలంలో ల్యాండ్‌ రేటు చుక్కలను తాకుతుండగా.. ఇంటి నిర్మాణం కోసం వాడే ప్రతి సామాగ్రి రేటు.. భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం అనేది పేద, మధ్యతరగతి వారికి పెను భారంగా మారింది. అందుకే చాలా మంది పేదలు సొంతింటి కలను చంపేసుకుంటున్నారు.

మరి మీరు కూడా ఇలానే సొంతింటి కోసం కల కని.. పెరుగుతున్న ఖర్చులను చూసి భయపడుతున్నారా.. అయితే మీకోసమే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చాం. కేవలం 4 లక్షల రూపాయలకే డబుల్‌ బెడ్రూం ఇంటిని నిర్మించుకోవచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..

నాలుగు లక్షల రూపాయలకే డబుల్‌బెడ్రూం ఇంటిని నిర్మించి చూపించారు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) నిపుణులు. పేద, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని.. కేవలం 4.4 లక్షల ఖర్చుతో డబుల్‌ బెడ్రూం ఇంటిని నిర్మించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరతో ఈ డబుల్‌బెడ్రూం ఇంటిని నిర్మించినట్లు ఎన్‌ఐఆర్‌డీ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ తరహా ఇంటిని నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. ఈ నిర్మాణంపై త్వరలోనే మేస్త్రీలు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ ఇస్తామని తెలిపారు.

ఎలా నిర్మించారంటే..

కేవలం నాలుగు లక్షల రూపాయల ఖర్చుతోనే నిర్మించిన ఈ డబుల్‌బెడ్రూం ఇంటి నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇంటి నిర్మాణం పునాది కోసం బండరాళ్లనే వాడారు. వాటిపై ఇటుకలతో స్తంభాలు నిర్మించారు. ఆ తర్వాత వాటి మధ్య వెదురు బొంగులు అమర్చి.. వాటి చుట్టూ సిమెంటు పూత పూసి గోడలు నిర్మించారు. వీటిపైన ఇనుప కమ్మలు, కంకర, సిమెంట్‌ మిశ్రమంతో బీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కుమ్మరి గూనలతో గుమ్మటం ఆకారంలో పైకప్పు వేశారు. వర్షం నీటికి కురకకుండా చూడటం కోసం పైకప్పును సిమెంటుతో ప్లాస్టరింగ్‌ చేసి.. ఆపై టైల్స్‌ అతికించారు.

ఫ్లోరింగ్‌ కోసం తాండూరు రాళ్లను వాడారు. ఆవుపేడ ఆధారిత సహజ రంగులతో పెయింట్‌ వేశారు. పెంకులతో పైకప్పు నిర్మించడం, వెదురుబొంగుతో గోడ నిర్మాణం చేయడం వల్ల.. ఈ ఇల్లు పర్యావరణహితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణలు. ఇలా నిర్మించిన ఇల్లు.. వేసవి కాలంలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

కేవలం 4 లక్షల్లో నిర్మాణమయ్యే ఈ నమూనా ఇంటిలో అన్ని సౌకర్యాలున్నాయి అంటున్నారు. 409.05 చదరపు అడుగుల్లో నిర్మించే ఈ ఇంట్లో.. 77.50 చదరపు అడుగుల్లో(చ.అ.) హాలు, 49 చ.అ.లో వంటగది, 80.83 చ.అ.లో పడక గది.., 23.56 చ.అ.లో అటాచ్డ్‌ బాత్రూం, 78.14 చ.అ.లో ఇంకో పడక గది, దానికి అనుబంధంగా 16.88 చ.అ.లో అటాచ్డ్‌ బాత్రూం ఉంటుంది. అంతేకాకుండా.. 30.02 చ.అ.లో బట్టలు ఉతుక్కునే ప్రాంతం కూడా ఉంది. ఇంటి నిర్మాణం చూసుకుంటే.. మొత్తంగా.. ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి కేవలం 987 రూపాయలు ఖర్చయినట్టు నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఈ ఇంటి నిర్మాణం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.