iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో మంచుని తలపిస్తున్న మురుగు నురుగు!

  • Published Sep 05, 2023 | 5:43 PM Updated Updated Sep 05, 2023 | 5:43 PM
హైదరాబాద్ లో మంచుని తలపిస్తున్న మురుగు నురుగు!

హైదరాబాద్ లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ మురుగు నీటితో నిండిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే కూకట్‌పల్లిలోని ఆల్విన్‌ కాలనీలో విషపూరితమైన నురగు కాశ్మీర్ లోని మంచు కొండలను తలపించాయి. నాలా నురుగు పొరతో కప్పబడి, బలమైన గాలులు వీయడంతో నురుగు గాల్లో ఎగురుతూ వచ్చాయి. అక్కడ ధరణీ నగర్ లో నురుగు మేఘాల్లా తలపిస్తున్నాయి. నురుగులో కొంత భాగం చుట్టుపక్కల ఇళ్లలోకి , ప్రధాన రహదారిపైకి వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో శనివారం నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు నాలాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఓ ప్రాంతంలో మాత్రం వర్షాల ప్రభావంతో కాశ్మీర్ లో మంచు ప్రాంతాన్ని తలపిస్తుంది. కానీ అది మంచు అనుకుంటే మురుగులో కాలు వేసినట్లే. లిబర్టీ, ఆల్విన్ కాలనీ వద్ద నాలాలో చాలా ఎత్తుకు నురుగు పెరిగి రోడ్లపైకి రావడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  విషపూరితమైన నురగ కాశ్మీర్‌లో మంచు ప్రాంతంలా కనిపిస్తుంది. రసాయన పరిశ్రమలు నాలాలోకి వ్యర్థాలను వదులుతుండగా, వర్షాలు కురుస్తుండటంతో నురుగు తెప్పలు తెప్పలుగా బయటకు వచ్చి చేరుతుంది. రోడ్లపై పెద్ద ఎత్తునే నురుగ తేలియాడుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

గత కొంత కాలంగా పుట్టే ఎల్లమ్మ బండ సరస్సులోకి అక్రమంగా రసాయన వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయని. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడితే.. నురగు గాల్లో తేలుతూ బయటకు వస్తుందని స్థానికులు అంటున్నారు. ధరిణి నగర్‌లో ఇళ్లు, రోడ్లు మొత్తం మురుగు నురుగుతో మునిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మురుగు నురగ మేఘాలను తలపిస్తుందని అంటున్నారు. రసాయనాలతో నిండిన ఆ నురుగ ఎంతో దుర్ఘందం వెదజల్లుతుందని.. కళ్లలో పడినా, చర్మానికి అంటుకున్న, ఆ గాలి పీల్చినా వివిధ రకాల జబ్బులు వస్తాయని  అని స్థానికులు అంటున్నారు. రాత్రి నుంచి భారీగా వర్షం పడటంతో ఆల్వీన్ కాలనీ లో మరోసారి మురుగు నురుగ భారీగా చేరింది.

ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడినప్పుడ్లా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలు పేరుకు పోయి నురుగులా తయారై ఆల్విన్ కాలనీలోకి ఇలా రోడ్లపైకి వచ్చి చేరుతుందని అంటున్నారు స్థానికులు. ఇది ఒక వారం పాటు ఇలాగే వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇది ఈనాటి సమస్య కాదని.. సంవత్సరాలు గుడుస్తున్నాయని..  తమ సమస్యల గురించి అధికారులకు తెలియజేసినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకోలేదన్నారు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.