వెలకట్టలేని ప్రేమకు నిలువెత్తు రూపం ఈ అమ్మ..

వెలకట్టలేని ప్రేమకు నిలువెత్తు రూపం ఈ అమ్మ..

ఈ భూమండలంపై వెలకట్టలేని ప్రేమ అంటూ ఉందంటే.. అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ. పసిబిడ్డగా ఉన్నప్పుడు గోరుముద్దలు తినిపించి, కంటికి రెప్పలా మనల్ని కాపాడుతుంది. బిడ్డ పెరిగి పెద్ద అయినా కూడా ఆమె కంటికి పసిబిడ్డాలనే కనిపిస్తుంటారు. అందుకే బిడ్డలు ఏ వయస్సులో ఉన్న.. వారికి చిన్న దెబ్బ తగిలితే చాలు.. అమ్మ అల్లాడి పోతుంది. తాజాగా ఓ తల్లి.. తన బిడ్డలపై  చూపిన ప్రేమను చూస్తే..కన్నీళ్లు ఆగవు. వృద్ధాప్యంలో కూడా.. తన బిడ్డలపై ఆ తల్లి చూపిస్తున్న ప్రేమకు సలాం చేయాల్సిందే. మరి.. ఆ అమ్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన చాపలమడుగు దానమ్మ వయస్సు 82 ఏళ్లు. ఈ వయస్సులో ఎవరైనా మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ, దానమ్మకు అలాంటి అదృష్టం లేదు. ఎందుకంటే విధిరాసిన రాతలో ఆమె.. వృద్ధాప్యంలో కూడా బిడ్డలకు సేవ చేసే పరిస్థితి వచ్చింది. ఆమెకు భూషి(67), దశరథ(40)అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కదల్లేని స్థితిలో ఉన్న ఈ ఇద్దరికి ఆమె ఏకైక దిక్కుగా మారింది. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం.

మొదటి ఇద్దరు కుమారులూ పుట్టుతోనే దివ్యాంగులు. మూడు, నాలుగు సంతానంగా ఆడపిల్లలు జన్మించారు. ఇక ఐదో సంతానంగా పుట్టిన కుమారుడు కూడా దివ్యాంగుడే. ఇలా ఏకంగా ముగ్గురు కుమారులు దివ్యాంగులు కావడంతో ఆమె తీవ్రవేదనకు గురైంది. అయినా కన్నప్రేమను చంపుకోలేక వారికి సేవలు చేస్తూ ఉంది. భర్త వెంకయ్యతో కలిసి కూలిపనికి వెళ్తూ పిల్లలను పోషించుకునేది. కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు.

కష్టాల్లో చేదోడుగా ఉన్న భర్త వెంకయ్య 24 ఏళ్ల కిందట మృతి చెందారు. 10ఏళ్ల క్రితం  రెండో కుమారుడు చనిపోయారు. ప్రస్తుతం మొదటి, ఐదో కుమారుడు ఉన్నారు. ఆ ముగ్గురికి వస్తున్న పింఛన్లే వారికి ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. అమ్మమ్మ పరిస్థితిని చూసి రెండో కుమార్తె కొడుకు ఆమెతోనే ఉంటూ మేనమామలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తన కుమారులకు చక్రాల కుర్చీలు ఇవ్వాలని దానమ్మ వేడుకుంటున్నారు. మరి.. ఆకాశమంత ప్రేమను చూపిన ఈ అమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments