మన కళ్ల ముందు పెరిగిన వాళ్లు, ఆప్తులు చనిపోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఇన్నాళ్లు మనతో ప్రయాణించిన వారు దూరమైతే తట్టుకోవడం చాలా కష్టం. ఇక, ములుగు ఎమ్మెల్యే సీతక్క పీఏ కొట్టం వెంకటనారాయణ అలియాస్ జబ్బర్ కన్నుమూశారు. ములుగులోని సాధన పాఠశాలకు దగ్గర్లో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో జబ్బర్ మరణించారు. వ్యక్తిగత పని మీద నర్సంపేటకు వెళ్లిన జబ్బర్.. తిరిగి ఇంటికి వెళ్తున్న టైమ్లో ఈ ప్రమాదం జరిగింది. సాధన హైస్కూల్ దగ్గరకు రాగానే జబ్బర్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ యాక్సిడెంట్లో జబ్బర్ తల రోడ్డుకు బలంగా తాకింది. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఎమ్మెల్యే సీతక్క వద్ద ఎనిమిదేళ్లుగా పీఏగా పనిచేస్తున్నారు జబ్బర్. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. యాక్సిడెంట్ టైమ్లో జబ్బర్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే తలకు బలమైన గాయమై చనిపోయారని డాక్టర్లు వెల్లడించారు. ఆదివారం నాడు జబ్బర్ స్వగ్రామమైన జగ్గన్నపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇన్నేళ్ల నుంచి తన దగ్గర పీఏగా పనిచేస్తున్న జబ్బర్ మరణవార్త విన్న వెంటనే హుటాహుటిన తరలివచ్చారు ఎమ్మెల్యే సీతక్క. ఆయన మృతదేహాన్ని చూసి ఆమె భోరున విలపించారు. జబ్బర్ కుటుంబ సభ్యుల బాధను చూసి.. సీతక్క మరింత ఎమోషనల్ అయ్యారు. ‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు’ అంటూ సీతక్క తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకవైపు ఏడుస్తూనే మరోవైపు జబ్బర్ కుటుంబసభ్యులను ఆమె ఓదార్చారు. అంత్యక్రియల్లో కూడా ఆమె పాల్గొన్నారు. పీఏ జబ్బర్ కుటుంబానికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని సీతక్క హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: దేశంలో అత్యధిక తాగుబోతులు తెలంగాణలోనే ఉన్నారు: తీన్మార్ మల్లన్న