Rythu Bharosa: ఎకరాకు రూ.15 వేలు.. రైతుల ఖాతాలో పడేది అప్పుడే

Minister Tummala-Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Minister Tummala-Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమైన హామీలన్నింటిని అమలు చేసింది. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ నిధులు పెంపు వంటి హామీలను అమలు చేసింది. ఇక కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైంది 2 లక్షల రైతు రుణమాఫీ. జూలై నెల నుంచి రేవంత్‌ సర్కార్‌ రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టింది. మూడు దశల్లో రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్ష, లక్షన్నర రూపాయల వరకు మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చింది.

ఇక రైతు రుణమాఫీతో పాటుగా మరో ముఖ్యమైన హామీ రైతు భరోసా. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేలు ఇచ్చింది. అయితే తాము అధికారంలోకి వస్తే.. ఈ మొత్తాన్ని 15 వేల రూపాయలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. రైతు భరోసా నిధుల కోసం అన్నదాతలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే వీటి విడుదలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇలా ఉండగా తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రైతు భరోసా నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చారు.

రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని.. కానీ తమ ప్రభుత్వం.. అలాంటి తప్పులు చేయదని.. రైతు భరోసా డబ్బుల విడుదలపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని తెలిపారు. ఈ పథకంపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. కాగా ఎకరాకు రూ.15వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది. అయితే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరుతాయో స్పష్టత రావడం లేదు. ఈ నిధుల విడుదలకు సంబంధించి కచ్చితంగా ఒక తేదీని ఫిక్స్‌ చేయడం లేదు.

అయితే ప్రస్తుతం రైతు భరోసా అమలుకు మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నామని.. వీలైనంత త్వరగా రైతుల ఖాతాలో ఈ నగదు జమ చేస్తామని తెలిపారు. ఇక రైతు రుణమాఫీ పూర్తి అయ్యాక రైతు భరోసా నిధుల విడుదల ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.

Show comments