నిరుద్యోగులకు మంత్రి గుడ్‌న్యూస్.. TSRTCలో 3 వేల కొత్త ఉద్యోగాలు..

Ponnam Prabhakar-Jobs: ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

Ponnam Prabhakar-Jobs: ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల వేళ నిరుద్యోగులకు కీలక హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ బోర్డును రద్దు చేసి ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టింది. తాజాగా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. ఇక త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కానుంది. అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది సర్కార్‌. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల కొత ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే టీఎస్‌ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నెలాఖరున అనగా జనవరి 31న అందుకు సంబంధించిన శుభవార్త వస్తుందని తెలిపారు. కరీంనగర్‌-2 డిపో ప్రాంగణంలో ఆదివారం నాడు.. కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం మాట్లాడిన పొన్నం.. ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. అంతేకాక త్వరలోనే కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. అలానే సంస్థలో మూడు వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇటీవల సంస్థ ఎండీ సజ్జనార్ కూడా ప్రకటన చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రావడంతో ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిందన్నారు. అందుకు అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే కొత్తగా 1,325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ సంస్థ ప్రణాళికలు రెడీ చేస్తోందని వెల్లడించారు.

ఈ క్రమంలో త్వరలో అందుబాటులోకి కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు సజ్జనార్‌ వెల్లడించారు. అంతేకాక ప్రస్తుతం 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ కొనసాగుతోందని.. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని సజ్జనార్ స్పష్టం చేశారు. ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు.. ఆర్టీసీ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show comments