దేశ భక్తి అంటే ఇది కదా.. లేవలేని స్థితితో బెడ్‌పై ఉన్నా..

దేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ ప్రధాని నుంచి సాధారణ పౌరుడి వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కరీంనగర్‌కు చెందిన ఓ రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన లేవలేని స్థితిలో బెడ్‌పై ఉన్నా.. తన దేశ భక్తిని చాటుకున్నాడు. బెడ్‌పై నుంచే జనగణమన పాడాడు.

ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..కరీంనగర్‌కు చెందిన గౌరిశెట్టి కుమారస్వామి దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో హెడ్‌ మాస్టర్‌గా పని చేశాడు. రిటైర్‌మెంట్‌ వయసు రాగానే రిటైర్డ్‌ అయ్యారు. ఇక, అప్పటినుంచి స్వగ్రామం అయిన వేముల వాడలో ఉంటున్నారు. అయితే, గత కొన్ని నెలల నుంచి ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 7 నెలల నుంచి మంచానికే పరిమితం అయ్యారు. నిన్న ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన తన దేశ భక్తిని చాటుకున్నారు.

లేవలేని స్థితిలో మంచంపై ఉన్నా.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని అనుకున్నారు. దేశంపై తనకున్న అమితమైన భక్తిని తనదైన శైలిలో చాటుకున్నారు. బెడ్‌పై నుంచే జాతీయ జెండాను పట్టుకుని జనగణమన పాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న జనం కుమారస్వామి దేశ భక్తికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ‍ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి, లేవలేని స్థితిలో బెడ్‌పై ఉన్నా.. స్వాతంత్ర దినోత్సవం నాడు మంచంపై నుంచే జనగణమన పాడిన కుమారస్వామి దేశ భక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.

Show comments