iDreamPost
android-app
ios-app

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు మహేష్ కుమార్ గౌడ్. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలు విడుదల చేశారు కేసీ వేణుగోపాల్. ఈ మేరకు ప్రకటన వెలువడింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు మహేష్ కుమార్ గౌడ్. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలు విడుదల చేశారు కేసీ వేణుగోపాల్. ఈ మేరకు ప్రకటన వెలువడింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలు విడుదల చేశారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. బీసీ వర్గానికి చెందిన నేతకు పీసీసీ చీఫ్ పదవి అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు మహేష్. అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు. జులై 7తో ఆయన పదవీకాలం ముగియడంతో తదుపరి తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు మహేష్ కుమార్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాదు జిల్లాలోని భీంగల్ మండలంలోని రహత్‌నగర్‌లో జన్మించారు. డిగ్రీ చదువుతున్న సమయంలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం నాయకుడిగా క్రియాశీలకంగా వర్క్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు.

మహేష్ కుమార్ గౌడ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ..  ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని కేటాయించడంతో పోటీ నుండి తప్పుకున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్  కొలువు దీరాక..  తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కోటా కింద ఆయన పేరును ఖరారు చేసింది అధిష్టానం. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో  మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు టీపీసీసీ పగ్గాలను అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.