SNP
SNP
తక్కువ వడ్డీకే ఈజీగా రుణం ఇస్తామని ఆశ చూపి, తిరిగి చెల్లించే సమయంలో ఆ వడ్డీ, ఈ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, లేట్ పేమెంట్ పెనాల్టీ అంటూ చారాణా ఇచ్చి బారాణా వసూలు చేస్తూ.. లోన్ యాప్‌లు కొంతమందిని వేధిస్తున్నాయి. వారి వేధింపులకు ఇప్పటికే ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడగా.. తాజాగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి సైతం ఈ లోన్ మాఫియాకు బలయ్యాడు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని కొండెంగులగుట్ట తండాకు చెందిన బానోత్ ఆకాశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆకాశ్ ఇటీవల ఓ లోన్ యాప్‌లో రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యం కాగానే.. లోన్ మాఫియా వేధింపులకు దిగింది. దీంతో విషయం తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు. పొదుపు సంఘం నుంచి రుణం మంజూరు కాగానే తిరిగి కట్టేద్దాంలే అని తల్లిదండ్రులు ఆకాశ్‌కు ధైర్యం చెప్పారు.
దీంతో ఇదే విషయం ఆకాశ్ సదరు లోన్ యాప్ నిర్వహకులకు ఫోన్లో వివరించినా వారి నుంచి వేధింపులు ఆగలేదు సరికదా.. ఒత్తిడి మరింత ఎక్కువైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆకాశ్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరూ గాఢనిద్రలో ఉండగా.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు కేవలం రూ.30ల అప్పుకు బలైపోయాడని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికుల చేత కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: తన స్వార్థం కోసం భర్తను బలి చేసిన భార్య!