Dharani
తాజాగా ఓ వింత సంఘటన వెలుగు చూసింది. సాధారణ స్థితికి భిన్నంగా రైతుకు న్యాయం చేయడం కోసం ఆర్టీఓ ఆఫీస్ ను సీజ్ చేశారు. ఆ వివరాలు..
తాజాగా ఓ వింత సంఘటన వెలుగు చూసింది. సాధారణ స్థితికి భిన్నంగా రైతుకు న్యాయం చేయడం కోసం ఆర్టీఓ ఆఫీస్ ను సీజ్ చేశారు. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోతే.. ఆస్తులను జప్తు చేస్తారు. ఏమాత్రం కనికరం చూపకుండా.. ప్రాపర్టీని స్వాధీనం చేసుకంటారు. మరీ ముఖ్యంగా అన్నదాతలు అప్పు చెల్లించకపోతే వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేస్తారు అధికారులు. కానీ తొలిసారి ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రైతుకు నష్టపరిహారం చెల్లించడంలో అలసత్వం వహించినందుకు ప్రభుత్వ కార్యాలయాన్ని జప్తు చేయాల్సిందిగా భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలి సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..
ఈ సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం రైతుల నుంచి భూమిని సేకరించి, నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఆర్డీవో ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ తీర్పు వెనక ఓ రైతు అలుపెరగని పోరాటం ఉంది. ఏం జరిగింది అంటే.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం భూమి ఇచ్చిన ఓ రైతుకు అధికారులు నష్టపరిహారం చెల్లించలేదు. దాంతో వరంగల్ ఆర్డీవో ఆస్తుల జప్తునకు భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలి ఆదేశాలు ఇచ్చింది. గురువారం ఉదయం మండలి అధికారులు, సిబ్బంది ఆర్డీవో ఆఫీసులోని ఏసీలు, కూలర్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆర్డీవో వాహనాన్ని సీజ్ చేస్తూ.. స్టిక్కర్లు అతికించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్కు కోసం 2014-16 సంవత్సరాల మధ్య భూసేకరణ జరిగింది. ఇందుకోసం శాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామి, ఆయన కుమార్తెకు చెందిన వివిధ సర్వే నంబర్లలోని 20 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇచ్చారు. ఇందుకు పరిహారంగా ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత భూసేకరణ అవసరం లేదన్నారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత భూమిని సేకరిస్తున్నట్లు నోటీసులు జారీచేశారు.
గతంలో నిర్ణయించిన రూ.పది లక్షల పరిహారమే చెల్లిస్తామని పేర్కొన్నారు. దీనిపై యాకస్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరిహారం పెంచాల్సిందిగా హైదరాబాద్‌లోని భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలిని ఆశ్రయించాడు. సర్వే నంబర్లలోని లోటుపాట్ల కారణంగా మొత్తం 20 ఎకరాలకు కాకుండా.. 12 ఎకరాలకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 6 నెలల క్రితం యాకస్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఎకరాకు రూ.20 లక్షల చొప్పున 12 ఎకరాలకు రూ.2.40 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. కానీ, ఈ తీర్పును అధికారులు పట్టించుకోకపోవడంతో యాకస్వామి మళ్లీ పిటిషన్ వేశారు. దాంతో ఆర్డీవో కార్యాలయ ఆస్తులు జప్తుచేసి యాకస్వామికి నష్టపరిహారం చెల్లించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో అధికారులు గురువారం కార్యాలయానికి వచ్చి వస్తువులను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తెలిపారు.