మొదటి సారి ఈ స్కూల్‌కి వచ్చినప్పుడు నాకు ఏడుపొచ్చింది: హిమాన్షు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, కేటీఆర్‌ కుమారుడు.. ఇప్పటి నుంచే తాత, తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని.. వారి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. చిన్న వయసు నుంచే పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ.. తాత, తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇక గత రెండు రోజులుగా హిమాన్షు పేరు మీడియాలో మారు మోగిపోతుంది. కారణం అతడు చేసిన మంచి పని. శిథిలావస్థకు చేరిన ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని.. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి.. దాన్ని కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా అభివృద్ధి చేశాడు హిమాన్షు. ఇక తన పుట్టిన రోజు జూలై 12 న స్కూల్‌ ప్రారంభించాడు. ఈ క్రమంలో తొలిసారి హిమాన్షు పబ్లిక్‌ స్పీచ్‌ ఇచ్చాడు. ఇక హిమాన్షు మాట్లాడుతున్నంతసేపు తాత, తండ్రిని గుర్తు చేశాడు. వారిలానే ఏమాత్రం భయం లేకుండా.. ఎంతో చక్కగా మాట్లాడాడు. ఇక తాను ఈ స్కూల్‌ను ఎందుకు దత్తత తీసుకున్నాడో చెప్పుకొచ్చాడు. తాను మొదటిసారి చూసినప్పుడు ఈ స్కూల్‌ పరిస్థితులు చూసి.. తనకు ఏడుపొచ్చింది అని చెప్పుకొచ్చాడు హిమాన్షు.

తన పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి తాను బాగు చేసిన స్కూల్‌ను ప్రారంభిండు హిమాన్షు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఇది నా తొలి పబ్లిక్ స్పీచ్.. కాస్త ఆందోళనగా ఉంది.. కానీ నా కుటుంబం ముందు మాట్లాడుతున్నట్లుంది. గతేడాది నుంచి ఈ స్కూల్‌కు వస్తున్నాను. నేను ఫస్ట్‌ టైం ఈ స్కూల్‌కు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని సమస్యలే కనిపించాయి. ఇక్కడి పరిస్థితులు చూసి నాకు చాలా బాధ కలిగింది. మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఆడపిల్లలకు సరైన వాష్‌రూంలు లేవు. స్కూల్‌ బయటే పందులు తిరుగుతున్నాయి. స్కూల్‌ బిల్డింగ్‌కు మెట్లు కూడా సరిగా లేవు. మౌళిక సదుపాయాలు అసలేం బాగా లేవు. ఓ పిల్లాడు జారి కిందపడిపోయాడు. క్లాస్ ‌రూంలోనే ఆఫీస్ రూం ఉంది. ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ క్షణం నేను పడ్డ బాధను మాటల్లో చెప్పలేను. అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ స్కూల్‌ కోసం ఏమైనా చేయాలి అనుకున్నాను. కానీ కేసీఆర్‌ మనవడిని కదా.. ఏదైనా నార్మల్‌గా చేయడం నాకు అలవాటు లేదు. ఇక మా స్కూల్‌ ప్రొగ్రాంలో భాగంగా ఈ స్కూల్‌కి గోడలు కట్టించాలి అనుకున్నాం. అందుకోసం నిధులు సేకరించాం’’అని తెలిపాడు.

‘‘స్కూల్‌ మనకు ఏం ఇచ్చింది అని కాదు.. పాఠశాలకు మనం ఏం చేశాం అన్నది ముఖ్యం. స్కూల్‌ కోసం మా కాలేజీలో రూ. 40 లక్షలు సేకరించాం. ఈ స్కూల్‌ను నేను ఎంపిక చేసుకోవటానికి ప్రధాన కారణం మా తాత కేసీఆర్‌ గారు. ఆయన ఎప్పుడూ ఓ మాట చెబుతుండేవారు. చదువుకున్న సమాజం.. మన ఎదురుగా కళ్ల ముందు కనిపిస్తోన్న సమస్యలకు ఇట్టే పరిష్కారం చూపగలదని చెప్పేవారు. మా తాత గారిని స్ఫూర్తిగా తీసుకోవడంవల్లే ఇవాళ ఈ స్కూల్‌ని ఇలా మార్చగలిగాను. దీని గురించి మా నాన్నకు చెబితే.. నీకు చదవుల్లో గ్రేడ్ తగ్గినా పర్లేదు.. కానీ వందమందికి సహాయం చేసే అవకాశం ఉంటే చేయ్యి. అందువల్ల నీ గ్రేడ్ తగ్గినా ప్రాబ్లం లేదని చెప్పారు. వందశాతం ఆ పిల్లల కోసం ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని నన్ను ప్రోత్సాహించారు’’ అని చెప్పుకొచ్చాడు.

‘‘మా తాత, నాన్న స్ఫూర్తితోనే ఈ పాఠశాలను ఇలా అభివృద్ధి చేశాను. ఈ క్రెడిట్ మెుత్తం నా స్కూల్ ప్రెండ్స్, మా టీచర్లకు దక్కుతుంది. వారి మద్దతు వల్లే ఈ స్కూల్‌ని ఇంత బాగా అభివృద్ధి చేయగలిగాను. ఇక్కడి పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే.. ఈ స్కూల్‌లో చదివిన మీరు ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, పొలిటిషయన్లుగా ఎదిగాలి. నాకేదైనా పని ఉంటే మీ దగ్గరకు వచ్చే స్థాయికి మీరు ఎదగాలి’’అంటూ హిమాన్షు రావు తన మెుదటి పబ్లిక్ స్పీచ్‌లోనే అదరగొట్టారు. హిమాన్షు మంచి మనసు, అతడి మాట తీరు చూసిన వారు.. తాత, తండ్రికి తగ్గ వారసుడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments