Dharani
Dharani
ఇంధన ధరలు పెరగడంతో.. బస్సు ఛార్జీలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిటీలో మినిమం బస్ ఛార్జీ 10 రూపాయలు ఉంది. నగరంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తిరగాలంటేనే.. వందల రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటిది మెట్రో నగరాల్లో తిరగాలంటే.. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రయాణికులకు ఓ బంపరాఫర్ ప్రకటించారు. రూపాయికే దేశ వ్యాప్తంగా తిరిగే ఆఫర్ ప్రయాణికులను ఊరిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒకటి ఈ బంపరాఫర్ ప్రకటించింది. తమ సర్వీస్‌లకు సంబంధించిన అన్ని రూట్లలో కేవలం ఒక్క రూపాయికే ప్రయాణం చేయవచ్చిన వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
ఇంటర్–సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలందించే న్యూగో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ బంపరాఫర్ ప్రకటించింది. దీనిలో భాగంగా కేవలం ఒక్క రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న అనగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది.
ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ..‘‘పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నాంర. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం కోసం ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆగస్ట్ 15 రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్ మొదలవుతాయి. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు మా రవాణా సేవలు కొనసాగుతాయి’’ అని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇండోర్– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్ వర్తిస్తుందని న్యూగో సంస్థ వివరించారు. బుకింగ్స్ కోసం న్యూగో వెబ్‌సైట్ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్ అప్లికేషన్లలోనూ బుకింగ్ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు.