Dharani
తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ వినియోగించే వారు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఈ పథకం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు..
తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ వినియోగించే వారు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఈ పథకం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు..
Dharani
ఆరు గ్యారెంటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం.. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం నుంచి అనగా శుక్రవారం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. పథకం ప్రారంభంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు స్వయంగా మీటరు రీడింగ్ తీసి వినియోగదారులకు అందించారు. వారికి జీరో బిల్లులు కొట్టారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం గృహజ్యోతి లబ్ధిదారులకు అలర్ట్ జారీ చేసింది. 200యూనిట్లకు పైన ఒక్క యూనిట్ అధికంగా కరెంట్ వాడినా పూర్తి బిల్లు కట్టాల్సిందే అని సూచించింది. ఆ వివరాలు..
మార్చి 1 నుంచి అనగా శుక్రవారం నుంచి విద్యుత్ సిబ్బంది.. ఇంటి ఇంటికి వెళ్లి గృహ జ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులు అందిస్తున్నారు. ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల సాఫ్ట్ వేర్‌లో మార్పులు చేశారు. రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికే ఇది వర్తిస్తుంది. ఈ జీరో బిల్లులో యూనిట్లు, బిల్లు ప్రింట్ చేసి.. గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తారు. ఇక త్వరలోనే ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. అయితే ఈ పథకం అమలుకు సంబంధించి జనాల్లో అనేక అనుమానాలున్నాయి. వాటిపై కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సదరు అధికారి తెలిపిన దాని ప్రకారం.. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించే వాళ్లే ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు. ఒకవేళ 1 యూనిట్ దాటినా.. అనగా 201 యూనిట్లు అయినా.. ఆ మొత్తానికి కరెంట్ బిల్ వేయడం జరుగుతుందన్నారు. అలాగే గతంలో కరెంట్ బిల్లులు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తించదని తెలిపారు. పాత బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే.. ఈ గృహజ్యోతికి అర్హులన్నారు. ఇక గత రికార్డుల ప్రకారం చూసుకుంటే.. రాష్ట్రంలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించేవారే సుమారు 90 శాతం వరకు ఉన్నారని వెల్లడయ్యింది. ఈ స్కీమ్ అమల్లోకి వచ్చాక కరెంట్ మరింత పొదుపుగా వాడతారని అధికారులు భావిస్తున్నారు.
200 యూనిట్లకు పైన ఒక్క యూనిట్ విద్యుత్ అధికంగా వాడినా.. వారు మొత్తం 201 యూనిట్లకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సుమారు వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చు. సాధారణంగా.. 200 యూనిట్ల కరెంట్‌కు బిల్లు దాదాపు రూ.900 వరకు రావొచ్చు. అందువల్ల మీ కరెంట్ బిల్లు 200 యూనిట్లకు పైన ఒక్క యూనిట్ దాటినా కూడా జేబుకు చిల్లు పడుతుందని చెప్పుకొవచ్చు. అంటే అప్పుడు మొత్తం కరెంట్ బిల్లు అనగా సుమారు రూ.1000 చెల్లించుకోవాల్సి రావొచ్చు. కనుక విద్యుత్ వినియోగం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
గృహ జ్యోతి పథకం ఎలా అప్లై చేయాలంటే మీరు సమీపంలోని గ్రామ పంచాయతీ, మండల కార్యాలయం లేదా మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి.. ఈ పథకానికి అవసరమైన పత్రాలతో పాటు భౌతిక దరఖాస్తు ఫామ్ సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్‌ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సంబంధిత కార్యాలయం నుండి పొందవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన తర్వాత, మీరు దరఖాస్తు ఫారమ్ పూరించడం, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం వంటి పనులన్నింటిని ఆన్లైన్‌లోనే చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు.