Dharani
ఎండలు మండుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. ఆ సమయాల్లో అసలు బయటకు వెళ్లవద్దంటూ సూచిస్తోంది. ఆ వివరాలు..
ఎండలు మండుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. ఆ సమయాల్లో అసలు బయటకు వెళ్లవద్దంటూ సూచిస్తోంది. ఆ వివరాలు..
Dharani
ఎండలు బాబోయ్ ఎండలు అన్నట్లుగా ఉంది వాతావరణం. కూలర్లు, ఏసీలు కూడా వేసవి తాపాన్ని చల్లార్చలేకపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. మండుతున్న ఎండలు చూసి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇక తెలంగాణలో అయితే మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే మార్చిలోనే ఇంత భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..
ఈ ఏడాది మార్చిలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న వారం రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని.. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భాగ్యనగరంలో బుధవారం నాడు ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. మార్చి నెల ముగిసే నాటికి.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశమందని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తుండటంతో.. ఆ సమయంలో బయటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వీలైనంత వరకు మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కీలక సూచనలు జారీ చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, క్యాప్, స్కార్ఫ్ వంటివి వాడాలని.. నీళ్ల బాటిల్ మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అలానే ఎండ తీవ్రతతో శరీరం పొడిబారడం, ఎర్రగా మారడం, తలనొప్పి, దురదలు, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ని కలవాలని సూచిస్తున్నారు.
బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్యులు. ఈ కాలంలో ఎక్కువగా కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణం లేదా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం తీసుకుంటే.. చెమట రూపంలో పోయిన లవణాలు శరీరానికి తిరిగి అందుతాయని చెప్పారు. సూర్యోదయానికి ముందే రోజూ వ్యాయామం చేస్తే మంచిదని.. అతిగా మాంసాహారం తీసుకుంటే శరీరంలోని నీటి శాతం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు.