P Venkatesh
P Venkatesh
సంకల్పబలముంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని నిరూపించింది ఆ యువతీ. కన్న వారి ఆశలను వమ్ము చేయకుండా అంకితభావంతో చదివి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ఓవైపు పేదరికం, మరోవైపు వెనకబడిన గిరిజన ప్రాంతం అయితేనేం తన పట్టుదల ముందు అవి చిన్నోబోయాయి. తను చేసిన కృషికి ఫలితంగా చిన్న వయసులోనే ఏకంగా జూనియర్ సివిల్ జడ్జీగా నియమితులైంది ఇల్లుటూరి హారిక. చిన్నతనంలో తన తండ్రి దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించగా నేడు దర్జీ కూతురు సివిల్ జడ్జీగా ఎంపికై రికార్డు సృష్టించింది. నేటి యువతకు హారిక ఆదర్శంగా నిలుస్తోంది.
న్యాయవాద వృత్తి వైపు అడుగులు..
ఇల్లుటూరి హారికది పేదకుటుంబం. ఆమె తండ్రి లక్ష్మయ్య, తల్లి స్వరూప వీరికి ముగ్గురు కూతుర్లు, కాగా వీరిలో ఒకరు హారిక. తండ్రి లక్ష్మయ్య దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. ఈ క్రమంలోనే వారి ఇంటి సమీపంలో ఓ కోర్టు ఉండేది. అయితే అక్కడికి వచ్చే లాయర్లను, జడ్జీలను చూసిన లక్ష్యయ్య తన కూతుర్లలో ఒక్కరినైనా జడ్జీని చేయాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఎదుగుదలకు లక్ష్మయ్య తపన పడుతుండేవారు. కాగా హారిక చిన్నతనం నుంచీ చదువుల్లో రాణిస్తుండేది. ఈ క్రమంలోనే ఆమె బీఏ ఎల్‌ఎల్‌బీ కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసింది.
మొదటి జడ్జీగా రికార్డు
ఇల్లుటూరి హారిక న్యాయవాద విద్య పూర్తి చేసిన తర్వాత 2022లో జేసీజే నోటిఫికేషన్ వచ్చింది. ఈ జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల కోసం వేలల్లో అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే తండ్రి కలల్ని నిజం చేసేందుకు కష్టపడి చదివిన హారిక ఈ పరీక్షలో విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హారిక న్యాయమూర్తిగా ఎంపికైంది. ఆ తర్వాత వరంగల్ థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా హారిక నియమించబడింది. అయితే తెలంగాణలోని గిరిజన ప్రాంతమైన ఇల్లందు హిస్ట్రీలో ఇప్పటి దాకా జడ్జీగా ఎవరూ ఎంపిక కాలేదు. ఫస్ట్ టైం ఇల్లుటూరి హారిక జూనియర్ సివిల్ జడ్జీగా ఎంపికై ఈ అరుదైన రికార్డును సాధించింది. గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఇల్లుటూరి హారిక జూనియర్ సివిల్ జడ్జీగా ఎంపిక కావడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.