Dharani
HYDRA Action Plan-Hyderabad Flood Free City: హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రాపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ వివరాలు..
HYDRA Action Plan-Hyderabad Flood Free City: హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రాపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ వివరాలు..
Dharani
గత రెండు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా.. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరీ ముఖ్యంగా సిటీ శివార్లలోని మోకిలాలో ఎంతో అద్భుతంగా నిర్మించిన సుమారు 200లకు పైగా విల్లాల అసలు గుట్టు ఇప్పుడు బయట పడింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలోమా విల్లా వెంచర్ నీటిలో మునిగింది. విల్లాకు వెళ్లే రోడ్లన్ని నడుములోతు నీట మునిగాయి. ఇదే కాదు నగరంలో ఎంతో అందంగా కనిపించే హైరైజ్ అపార్ట్మెంట్లలో చాలా చోట్ల ఇదే పరిస్థితి.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యి.. చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. చిన్న వర్షానికే నగరం ఎందుకు ఇలా జలదిగ్భందంలో చిక్కుకుంటుంది అనే ప్రశ్నలకు ఎవరి నుంచైనా వచ్చే సమాధానం.. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఇలానే ఉంటుంది అంటున్నారు.
సాధారణంగా తెలంగాణ అంటేనే చెరువుల రాష్ట్రం. అలానే హైదరాబాద్ ను కూడా చెరువుల నగరం అంటారు. 30 ఏళ్ల క్రితం వరకు నగరంలో చెరువుల సంఖ్య భారీగానే ఉండేది. కానీ 1979-2020 మధ్య సుమారు 61 శాతం చెరువులను కబ్జా చేసి.. ఆక్రమించి.. అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అందుకే చిన్న వర్షాలకు కూడా నగరంలో వరదలు వస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్న గొలుసుకట్టు చెరువు వ్యవస్థ నగరానికి వరద సమస్య రాకుండా చూసుకునేది. అయితే రాను రాను ఈ వ్యవస్థ మాయం అయ్యింది. చెరువులు కబ్జాలకు గురయ్యాయి. అక్కడ వాటి స్థానంలో భవంతులు వెలిశాయి. ఫలితం.. చినుకు పడితే చాలు నగర వాసులకు నరకం కనిపిస్తుంది.
అయితే ఈ ఆక్రమణలను తొలగించాలని గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి. కానీ లాభం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆక్రమణలపై దృష్టి సారించింది. వీటి తొలగింపుకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రారంభం నుంచే హైడ్రా ఆక్రమణల విషయంలో దూకుడుగా వెళ్తుంది. ఫలితంగా రోడ్లు విశాలం అయ్యాయి.. చెరువులు బాగుపడుతున్నాయి. హైడ్రా ప్రధాన ఉద్దేశమే చెరువుల్లో నిర్మించిన ఆక్రమణలను.. నాలాలు కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు. ఇది పూర్తి స్థాయిలో అమలైతే.. హైదరాబాద్ కు వరద ముప్పు తప్పుతుందని జనాలు నమ్ముతున్నారు.
హైడ్రా చర్యలపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే దూకుడు కొనసాగించాలని కోరుకుంటున్నారు. కానీ ఓ వర్గం మాత్రం.. హైడ్రావ్యవస్థపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలు హైదరాబాదీల కళ్లు మరోసారి తెరిపించేలా ఉన్నాయి. హైడ్రా ఆక్రమణలు తొలగించిన ప్రాంతంలో గతానికి, ఇప్పటికి చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది అంటున్నారు జనాలు. మిగతా చెరువుల్లోని ఆక్రమణలు తొలగిస్తే.. హైదరాబాద్ కు పూర్వ వైభవం వస్తుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి సైతం హైడ్రాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
తాజాగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం అక్కడ కూడా ఆక్రమణలు, కబ్జాలు. దాంతో తమకు హైడ్రా కావాలంటూ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. హైడ్రా పరిధిని విస్తరించాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
హైడ్రా చర్యల వల్ల జనాల్లో కూడా అవగాహన పెరిగింది. తాము కొన్న భూములు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా లేదా అని చర్చించుకుంటున్నారు. అలానే చెరువులు ఆక్రమించి అపార్టమెంట్లు, విల్లాలు నిర్మించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక హైడ్రా చర్యల వల్ల ఆక్రమణలు తొలగిపోవడమే కాక.. ఇకపై ఇలాంటి నిర్మాణాలకు అనుముతలు ఇచ్చే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటారని.. హైడ్రాను స్వేచ్ఛగా పని చేయనిస్తే.. పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.