iDreamPost
android-app
ios-app

HYDRA: నా కుటుంబ సభ్యులు, బంధువులవి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూల్చేస్తాం: సీఎం రేవంత్‌

  • Published Aug 28, 2024 | 2:59 PM Updated Updated Aug 28, 2024 | 2:59 PM

CM Revanth Reddy Chit Chat On HYDRA: హైడ్రా దూకుడుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

CM Revanth Reddy Chit Chat On HYDRA: హైడ్రా దూకుడుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Aug 28, 2024 | 2:59 PMUpdated Aug 28, 2024 | 2:59 PM
HYDRA: నా కుటుంబ సభ్యులు, బంధువులవి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూల్చేస్తాం: సీఎం రేవంత్‌

హైదరబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏవీ రంగనాథ్‌ దీనికి కమిషనర్‌గా ఉన్నారు. ప్రారంభమైన మొదటి రోజు నుంచే హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. అక్రమాలకు పాల్పడితే చాలు.. బుల్డోజర్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తోంది. దీనిలో భాగంగానే అక్కినేని నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ని కూల్చి వేయడంతో హైడ్రా పేరు మీడియా, సోషల్‌ మీడియాలో మార్మోగిపోతుంది. హైదరాబాద్‌ జనాలు హైడ్రాకు మద్దతిస్తున్నారు. సీఎం రేవంత్‌కు జేజేలు కొడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

హైడ్రా దూకుడుపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘‘నా కుటుంబ సభ్యులు, స్నేహితుల నిర్మాణాలు ఉన్నా కూల్చేస్తాం. ఆ వివరాలు నాకు ఇవ్వండి.. నేనే దగ్గరుండి కూల్చేపిస్తాను’’ అన్నారు. అంతేకాక హైడ్రా కేవలం హైదరాబాద్‌ వరకే పరిమితం అని.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, చెరువులు, నాలాలే మొదటి ప్రయారిటీ అని సీఎం రేవంత్‌ చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా.. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని తెలిపారు. నా కుటుంబ సభ్యులవి అక్రమ కట్టడాలని ఆధారాలతో నిరూపిస్తే.. నేనే దగ్గరుండి వాటిని కూల్చేపిస్తాను’’ అన్నారు.

అలానే కేటీఆర్‌ ఫాంహౌస్‌కు సర్పంచ్‌ అనుమతి ఇచ్చారంటున్నారు.. సర్పంచ్‌లకు ఆ అధికారం లేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసమే కూల్చివేతలు అని సీఎం రేవంత్‌ మరోసారి స్పష్టం చేశారు. రాయదుర్గంలో కూల్చివేత సరైందే అన్నారు. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ గైడ్‌లైన్స్‌ పాటిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

కవిత బెయిల్‌పై స్పందిస్తూ..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తీహార్‌ జైలుకు వెళ్లిన కవితకు సుమారు ఐదున్నర నెలల తర్వాత బెయిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్‌ స్పందిస్తూ..‘‘సిసోడియాకు బెయిల్‌ రావడానికి 15 నెలలు పట్టింది.. కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్‌ రాలేదు. కానీ కవితకు మాత్రం ఐదున్నర నెలల్లోనే బెయిల్‌ వచ్చింది. దీనికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నాను. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒప్పందం మేరకే కవితకు బెయిల్‌ వచ్చింది’’ అని ఆరోపించారు. అలానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని.. కానీ హరీశ్‌ రావు మాత్రం దీనిపై చేసిన సవాల్‌కు కట్టుబడి లేడని సీఎం రేవంత్‌ ఎద్దేవా చేశారు.