iDreamPost
android-app
ios-app

HYD: గీజర్‌ ఇలా వాడితే ఎంత ప్రమాదమో.. ఈ ముగ్గురి జీవితమే ఉదాహరణ

  • Published Jul 23, 2024 | 10:53 AMUpdated Jul 23, 2024 | 10:53 AM

Hyd, Sanath Nagar-Gas Leaking From Geyser: మీ ఇంట్లో వేడి నీటి కోసం గీజర్‌ వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే. గీజర్‌ వాడకం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇదుగో వీరిలాంటి పరిస్థితే మీకు ఎదురవ్వొచ్చు. ఆ వివరాలు..

Hyd, Sanath Nagar-Gas Leaking From Geyser: మీ ఇంట్లో వేడి నీటి కోసం గీజర్‌ వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే. గీజర్‌ వాడకం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇదుగో వీరిలాంటి పరిస్థితే మీకు ఎదురవ్వొచ్చు. ఆ వివరాలు..

  • Published Jul 23, 2024 | 10:53 AMUpdated Jul 23, 2024 | 10:53 AM
HYD: గీజర్‌ ఇలా వాడితే ఎంత ప్రమాదమో.. ఈ ముగ్గురి జీవితమే ఉదాహరణ

టెక్నాలజీ పెరిగిన కొద్ది.. మన జీవితంలోకి వచ్చే సౌకర్యాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా మనకు బద్దకం, అనేక కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో పాటు సాంకేతికత వల్ల వచ్చిన కొన్ని సౌకర్యాలు.. కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణాలు తీస్తుంటాయి. అందుకే ఏవైనా ఎలక్ట్రిక్‌ పరికరాలు ఉపయోగించే సమయంలో వాటి వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదని ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏకంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తాజాగా హైదరాబాద్‌, సనత్‌ నగర్‌లో ఈ తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. చిన్న అజాగ్రత్త ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. ఆ వివరాలు..

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి మృతికి కారణం.. గీజర్‌ అని తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన..దంపతులు వెంకటేశ్ (55), మాధవి(50) వారి కుమారుడు హరి(30) సనత్‌నగర్ జెక్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్టుమెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వాస్తవానికి వారి స్వస్థలం కర్ణాటక. ఉపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చారు. ఇక ఆదివారం (జులై 21) వారంతా బాత్‌ రూంలో వారు విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ముందుగా వారంతా.. కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు భావించారు.

ఆ తర్వాత విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంలోని ముగ్గురి మృతికి గీజర్ కారణమని పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తులు తమ ఇంట్లో.. గత కొంత కాలం నుంచి గ్యాస్ సిలిండర్ ద్వారా గీజర్‌ను వాడుతున్నట్లు గుర్తించారు. ఈక్రమంలో దాన్నుంచి వెలువడిన విషవాయువుల వల్లే వారు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ముందుగా కుమారుడు హరి స్నానం చేసేందుకు వెళ్లి బాత్‌రూంలో సృహ తప్పి పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

కుమారుడు పడిపోవడంతో బాత్రూం లోపలికి వెళ్లిన తల్లి, తండ్రి కూడా విషవాయువులు పీల్చి స్పృహ తప్పి అక్కడే పడిపోయారు. అంతేకాక గీజర్, గ్యాస్‌ల నుంచి విషవాయువులు వెలువడటంతోనే ముగ్గురు మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులోనూ వెల్లడైందన్నారు పోలీసులు. ఈ మేరకు ముగ్గురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గీజర్‌ ఇలా వాడితే ప్రాణాలకే ముప్పు..

ఇటీవల కాలంలో వేడి నీటి కోసం గీజర్ల వినియోగం పెరిగింది. అయితే కరెంట్ అవసరం లేకుండా.. ఖర్చు తక్కువగా ఉండే గ్యాస్ గీజర్లు వాడుతున్నారు చాలా మంది. ఎల్పీజీ సిలిండర్ ద్వారా ఈ గీజర్లు నీటిని వేడి చేస్తాయి. అయితే దీన్ని అదే పనిగా ఆన్‌లో ఉంచటం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలానే వెంటిలేషన్ సరిగ్గా లేని గదుల్లో గ్యాస్ గీజర్లు అస్సలు అమర్చకూడదని చెబుతున్నారు. అలా చేయటం వల్ల ఒక్కోసారి రంగు, వాసన లేని కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవుతుందని అంటున్నారు. ఆ విషవాయువులు గుర్తించేలోపే.. అస్వస్థతకు గురై మృతి చెందే అవకాశం ఉందని.. తాజాగా సనత్ నగర్ కుటుంబం మృతి ఘటనలో ఇదే జరిగిందని అంటున్నారు. కనుక గీజర్‌ వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి