Dharani
Dharani
సాధారణంగా దశాబ్దాలు, శతాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు శిధిలావస్థకు చేరుకుని.. ప్రమాదాలకు కారణం అవుతాయి. ఏళ్ల తరబడి ఎండకు ఎండి.. వానకు తడిచి ఉండటం వల్ల.. ఈ భవనాలు శిథిలం అయ్యి కూలిపోవడం, ఓ పక్కకు ఒరగడం వంటి ప్రమాదాలను సృష‍్టిస్తాయి. కానీ ఇప్పుడు మనం ఇందుకు భిన్నమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఓ భవనం పక్కకు ఒరిగి స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మరి అది ఏమైనా పురాతనమైన భవనమా అంటే కాదు.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్.
అది కాస్త ఓ పక్కకు ఒరగడంతో.. జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సంఘటన మన భాగ్యనగరంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఆ వివరాలు… హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం అకస్మాత్తుగా పక్కకు ఒరిగిపోవడం సంచలనంగా మారింది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ బహుళ అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే దీని గురించి స్థానిక అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. భవనం యజమానిపై కేసు నమోదు చేశారు. పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న భవనం ఇలా పక్కకు ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు.