iDreamPost
android-app
ios-app

రూ.200 కోసం గొడవ.. రూ.2 కోట్లు ఖర్చు చేసినా దక్కని ప్రాణం.. రెండేళ్లుగా నరకం.. చివరకు

  • Published Aug 05, 2024 | 9:34 AM Updated Updated Aug 05, 2024 | 9:34 AM

BN Reddy Cab Driver Incident: అతడి ఆరోగ్యం కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. రెండేళ్ల పాటు వైద్యం చేసినా లాభం లేకుండా పోయింది. చివరకు..

BN Reddy Cab Driver Incident: అతడి ఆరోగ్యం కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. రెండేళ్ల పాటు వైద్యం చేసినా లాభం లేకుండా పోయింది. చివరకు..

  • Published Aug 05, 2024 | 9:34 AMUpdated Aug 05, 2024 | 9:34 AM
రూ.200 కోసం గొడవ.. రూ.2 కోట్లు ఖర్చు చేసినా దక్కని ప్రాణం.. రెండేళ్లుగా నరకం.. చివరకు

ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లల తర్వాత.. ఐదో సంతానంగా కొడుకు పుట్టాడు. దాంతో తల్లిదండ్రులు అతడిని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. అయితే తల్లిదండ్రుల ప్రేమను అవకాశంగా తీసుకుని.. చిల్లరమల్లర వేషాలు వేయకుండా.. బాగా చదువుకున్నాడు ఆ యువకుడు. డిగ్రీ పూర్తి చేశాడు. ఎస్సై కావాలనేది అతడి కల. అందుకోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. అయితే తన చదువుకు అయ్యే ఖర్చు.. తల్లిదండ్రులకు అదనపు భారం కాకూడదని భావించి.. రాత్రి పూట క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తూనే పగలు ఎస్సై ట్రైనింగ్‌కు వెళ్లేవాడు. మరి కొన్ని రోజుల్లో అతడి కలలు నెవవేరి.. ఒంటి మీదకు ఖాకీ డ్రెస్‌ వచ్చేది. కానీ విధి రాత మరోలా ఉంది. ప్రభుత్వం ఉద్యోగం సంపాదించి.. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని భావించిన అతడి కలలను కొందరు ఆకతాయిలు నాశనం చేశారు. కేవలం రెండు వందల రూపాయల కోసం.. ఆ యువకుడిని అత్యంత దారుణంగా చితకబాది.. ఆ కుటుంబానికి తీరని కడుపుకోత మిగిల్చారు. ఆ వివరాలు..

నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం సాయి రెడ్డి గూడారనికి చెందిన అంజయ్య గౌడ్, వెంకటమ్మలకు ఐదుగురు సంతానం. వీరిలో నలుగురు ఆడపిల్లలు.. ఓ కుమారుడు వెంకటేష్‌ సంతానం ఉన్నారు. వీరిది సన్నకారు రైతు కుటుంబం. డిగ్రీ దాకా చదివిన వెంకటేశ్ ఎస్సై కోచింగ్ కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఎల్బీ నగర్‌లో ఉంటూ ఎస్సై కోచింగ్‌ తీసుకునేవాడు. ఈ క్రమంలో రాత్రిళ్లు క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇలా ఉండగా రెండేళ్ల క్రితం అతడి జీవితాన్ని నాశనం చేసే ఘటన ఒకటి చోటు చేసుకుంది. 200 రూపాయల కోసం జరిగిన గొడవ వల్ల వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ రెండేళ్ల నుంచి సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. రెండేళ్లుగా మృత్యువుతో పోరాడి అలసిపోయిన వెంకటేష్‌ తాజాగా కన్ను మూశాడు.

అసలేం జరిగిందంటే..

రెండేళ్ల క్రితం అనగా.. 2022 జులై 31న రాత్రి సమయంలో వివేక్ రెడ్డి అనే వ్యక్తి బీఎన్ రెడ్డి నగర్ నుంచి ఉప్పర్‌పల్లికి వెంకటేశ్ నడిపే క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రూ.900 ఛార్జీ కాగా వివేక్ రూ.700 మాత్రమే ఇచ్చి వెళ్లబోయాడు. ఇంకో రూ.200 ఇవ్వాలని వెంకటేష్‌ అడగడంతో.. అది కాస్త గొడవకు దారి తీసింది.ఈ క్రమంలో ఆగ్రహించిన వివేక్‌.. తన స్నేహితులకు కాల్‌ చేసి పిలపించాడు. అర్ధరాత్రి సమయంలో.. మద్యం మత్తులో ఉన్న 20 మంది అక్కడికి వచ్చారు. వస్తూనే వెంకటేశ్‌పై క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాక.. బంగారం దొంగతనం చేశాడని తప్పుడు ఆరోపణలు చేసి.. రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. దాంతో అతడిని రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో.. ఉదయం 6 గంటలకు అతడిని ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆలస్యం కావడంతో వెంకటేశ్ కోమాలోకి వెళ్లాడు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్‌పై దాడికి పాల్పడిన వారిలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. రోజుల వ్యవధిలోనే వారంతా బెయిల్‌ మీద బయటకు వచ్చారు. కానీ వెంకటేష్‌ ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. ఒక్కగానొక్క కొడుకును బతికించుకోవడం కోసం.. ఉన్నదంతా అమ్మారు.. చివరకు ఇంటిని కూడా తాకట్టు పెట్టారు.

రూ.2 కోట్లు ఖర్చు చేసినా..

కొడుకు కోలుకుంటే చాలు.. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అనుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తూనే కొడుకును బతకాలని దేవుళ్లందరికి మొక్కుకున్నారు వెంకటేష్‌ తల్లిదండ్రులు. కానీ వారి ప్రయత్నాలు, మొక్కులు ఫలించలేదు. 200 రూపాయల కోసం జరగిన గొడవ చివరకు 2 కోట్ల రూపాయలు ఖర్చు, రెండేళ్ల పాటు నరకం అనుభవించి.. చివరకు కన్ను మూశాడు. ఇక అతడిపై దాడి చేసిన వారు మాత్రం.. దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇక వెంకటేష్‌ తల్లిదండ్రులు బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది.