iDreamPost
android-app
ios-app

ఓటు వేసాక.. వేలుకి పూసిన ఇంకు ఎందుకు పోదు!.. దీన్ని ఎక్కడ ఎలా చేస్తారు?

  • Published May 16, 2024 | 10:40 PM Updated Updated May 16, 2024 | 10:40 PM

ఓటు వేసే ముందు వేలి మీద ఇంకు పూస్తారు. అయితే ఓటు వేసిన తర్వాత ఆ ఇంకు మరక అలానే ఉండిపోతుంది. వారం రోజులైనా గానీ ఆ మరక పోదు. పోకుండా ఉండేలా ఇందులో ఏం కలుపుతారు? అసలు ఈ ఇంకుని ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు?

ఓటు వేసే ముందు వేలి మీద ఇంకు పూస్తారు. అయితే ఓటు వేసిన తర్వాత ఆ ఇంకు మరక అలానే ఉండిపోతుంది. వారం రోజులైనా గానీ ఆ మరక పోదు. పోకుండా ఉండేలా ఇందులో ఏం కలుపుతారు? అసలు ఈ ఇంకుని ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు?

  • Published May 16, 2024 | 10:40 PMUpdated May 16, 2024 | 10:40 PM
ఓటు వేసాక.. వేలుకి పూసిన ఇంకు ఎందుకు పోదు!.. దీన్ని ఎక్కడ ఎలా చేస్తారు?

ఓటు ఇది రాష్ట్ర, దేశ రాజకీయాలను మార్చేసే ఒక ఆయుధం. ఈ దేశంలో సంపన్నుడికైనా, సామాన్యుడికైనా, పెద్దవాడికైనా, పేదవాడికైనా సమానమైన ఆయుధం ఉంది అంటే అది ఓటే. ఒక ఓటు దేశ భవిష్యత్తుని మార్చేస్తుంది. ఒకే ఒక్క ఓటు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది. ఒక్క ఓటే కదా అని తీసిపడేయడానికి వీల్లేదు. అలాంటి ఓటు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం వేలుకు ఇంకు పూస్తారు. ఒకసారి ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ వేయకుండా ఉండేందుకు ఇలా చేస్తారని తెలుసు. అయితే వేలుకి పూసిన ఇంకు అంత త్వరగా పోదు. చాలా రోజుల వరకూ అలానే ఉండిపోతుంది. ఈ ఇంకు ఎందుకు అంత త్వరగా పోదు. దీన్ని ఎక్కడ చేస్తారు? ఎలా చేస్తారు?

ఎలా తయారు చేస్తారంటే?:

ఎలక్టోరల్ ఇంకు లేదా ఓటర్ ఇంకు లేదా ఎలక్షన్ ఇంకు అని పిలుస్తారు. దీన్ని అలా ఉండడం కోసం ఇందులో సిల్వర్ నైట్రేట్ ని కలుపుతారు. ఈ సిల్వర్ నైట్రేట్ కలిపిన ఇంకు వేలిని తాకగానే మరకలా అంటుకుపోతుంది. ఇది నీళ్లతో చేసిన ఇంకు అయినప్పటికీ ఇందులో ఆల్కహాల్ లాంటి సాల్వెంట్ ఉంటుంది. దీని వల్ల ఇంకు వేలుకి పూయగానే త్వరగా ఆరిపోతుంది. అయితే ఇంకులో ఉండే సిల్వర్ నైట్రేట్ గాఢత అనేది ఎంత కాలం ఉండాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 7 శాతం నుంచి 25 శాతం వరకూ సిల్వర్ నైట్రేట్ గాఢత ఉంటుంది. ఒక్కసారి ఇంకు పూసాక అది అంత త్వరగా పోదు. ఇంకు పూసిన చర్మం మీద పాత చర్మం వచ్చే వరకూ ఆ ఇంకు అలానే ఉంటుంది. గాఢతను బట్టి 72 నుంచి 96 గంటలు.. కొన్ని సందర్భాల్లో 2 నుంచి 4 వారాల వరకూ ఉంటుంది. గాఢత ఎక్కువ శాతం ఉంటే కనుక మరక పూర్తిగా పోవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది.       

ఎక్కడ తయారు చేస్తారు?:

వేలుకి ఇంకు పూసే విధానాన్ని భారత ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. ఈ ఇంకును పోలింగ్ బూత్ లకి ఎన్నికల సంఘమే పంపుతుంది. అయితే ఈ ఎన్నికల సంఘానికి సరఫరా చేసే కంపెనీలు ఉన్నాయి. మొదట్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ అనే కంపెనీ ఇంకుని తయారు చేసి ఎన్నికల సంఘానికి సరఫరా చేసేది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కంపెనీ నుంచే ఓటర్ ఇంకు వెళ్ళేది. 1990 నుంచి హైదరాబాద్ లో ఇంకు తయారీ కంపెనీ ప్రారంభమైంది. ఉప్పల్ లోని రాయుడు లేబొరేటరీస్ అనే కంపెనీ.. ఇంకుని తయారు చేసి ఎన్నికల సంఘానికి సప్లై చేస్తుంది. మన దేశంలోనే కాకుండా.. విదేశాలకు కూడా ఇంకుని సరఫరా చేస్తుంది ఈ కంపెనీ. శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికా, జాంబియా వంటి దేశాలకు ఇంకుని ఎగుమతి చేస్తుంది ఈ హైదరాబాదీ కంపెనీ. ఈ ఇంకుని 5 ఎంఎల్, 10 ఎంఎల్, 25 ఎంఎల్, 50 ఎంఎల్, 60 ఎంఎల్, 100 ఎంఎల్ సైజు బాటిల్స్ లో నింపి సరఫరా చేస్తుంది. మన దేశంలో మాత్రం 5 ఎంఎల్ బాటిల్స్ ని సప్లై చేస్తుంది. ఒక ఇంకు సీసా 300 మందికి సరిపోతుందని కంపెనీ వాళ్ళు చెబుతున్నారు.