Dharani
Dharani
గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్లు, కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. గురువారం, శుక్రవారం రెండు రోజులు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. ఇక భాగ్యనగరం అయితే సోమవారం నుంచి వర్షంలో తడిసి ముద్దవుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.