తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు హాలిడే!

  • Author singhj Published - 04:50 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 04:50 PM, Mon - 4 September 23
తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు హాలిడే!

తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం పొద్దున నుంచి హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా.. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. రాష్ట్ర రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉంది. బంజారాహిల్స్​తో పాటు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. రాబోయే 48 గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈశాన్య బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడ ప్రాంతం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. అక్కడి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని ఇందల్వాయి, డిచ్​పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్​పల్లిలో వర్షం దంచికొడుతోంది. గన్నారంలో 14 సెంటీమీటర్లు, చీమనుపల్లిలో 12 సెంటీమీటర్లు.. జుక్కల్, జక్రాన్​పల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, రుద్రారం, గాంధారి, పిట్లం, బాన్సువాడ, జుక్కల్, తాడ్వాయి, బీర్కూర్ మండలాల్లో వర్షం పడుతోంది. వానల కారణంగా విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిజామాబాద్ డిస్ట్రిక్ట్​లోని స్కూళ్లకు (సెప్టెంబర్ 4వ తేదీన) సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. ఈ రోజు లోకల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. కాగా, నిర్మల్, ఉమ్మడి మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: కంట్రీ డిలైట్​ డెయిరీపై అధికారుల దాడులు!

Show comments