హైదరాబాద్ లో భారీ వర్షం.. ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం అంటే..!

హైదరాబాద్ లో శనివారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కాస్త తెరపించినా.. సోమవారం నుంచి వర్షం దంచికొడుతుంది. మంగళవారం తెల్లవారుజామునే మొదలైన వర్షం నాలుగు గంటల పాటు నాన్ స్టాప్ గా పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతులో నీరు నిండటంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి కిలో మీటర్ల మేరకు వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. నగరంలో మరో రెండు మూడు గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదు అయ్యిందో తెలుసుకుందాం.

హైదరాబాద్ లో వరుణుడు విజృంభిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ప్రకటించారు.. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు అధికారు. అంతేకాదు సమస్యాత్మక ప్రదేశాల్లో అధికారులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందిగా సూచించింది. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

నగరంలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాంతాల వారీగా వర్షపాతం వివరాలు చూస్తే… మియాపూర్‌లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కూకట్ పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి 11.45 సెం.మీ., గాజుల రామారం 10.9 సెం.మీ., మాదాపూర్‌లో 10.7 సెం.మీ., ఖైరతాబాద్‌ 10.1 సెం.మీ., గచ్చిబౌలిలో 9.6 సెం.మీ., సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లో 11.2 సెం.మీ., రాయదుర్గంలో 10.1 సెం.మీ., బోరబండ 11.6 సెం.మీ., షాపూర్‌లో 10.6 సెం.మీ., షేక్‌పేటలో 11.9 సెం.మీ., శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు., జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్., కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు., ముషీరాబాద్ లో 9.9 సెం.మీ, మలక్ పేట్ లో 9.4 సెం.మీ, గోషా మహాల్ లో 9.5 సెం.మీ., ఎల్బీనగర్ లో 6.6 సెంటీమీటర్లు., బహదూర్‌పురా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాల కారణంగా బస్తీల్లోకి భారీగా నీళ్లు చేరాయి. దీంతో కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Show comments