P Venkatesh
P Venkatesh
గ్రూప్ 2 ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మరో పిడుగులాంటి వార్త. తాజాగా తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. కాగా గ్రూప్ 2 పరీక్షవాయిదా పడడం ఇది రెండోసారి. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీనిపై పునరాలోచన చేసిన ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీకి సూచించింది.
కాగా అప్పుడు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించింది. కాగా తాజాగా మళ్లీ వాయిదా పడింది. దీనికి గల కారణం ఏంటంటే.. తాజాగా ఈసీ తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణ కష్టమని భావించిన అధికారులు పరీక్షను వాయిదా వేశారు. అలాగే, ఈ పరీక్షను వచ్చే ఏడాది(2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మళ్లీ వాయిదా పడడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.