iDreamPost
android-app
ios-app

TSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్‌ సర్కార్‌.. ఇన్నేళ్ల తర్వాత

  • Published Apr 29, 2024 | 8:21 AM Updated Updated Apr 29, 2024 | 8:21 AM

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి ఏళ్ల నిరీక్షణకు తెర పడనుంది. ఆ వివరాలు..

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి ఏళ్ల నిరీక్షణకు తెర పడనుంది. ఆ వివరాలు..

  • Published Apr 29, 2024 | 8:21 AMUpdated Apr 29, 2024 | 8:21 AM
TSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్‌ సర్కార్‌.. ఇన్నేళ్ల తర్వాత

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌.. నాలుగు నెలల పాలనలోనే ఇచ్చిన హామీల్లో.. ఎక్కువ భాగం అమలు చేసి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పాలన కొనసాగిస్తుంది. ఆరు గ్యారెంటీల అమలుతో సామాన్యులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం సామాన్య జనాల విషయంలోనే కాక.. ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం కూడా రేవంత్‌ సర్కార్‌ ముందడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న కొన్ని అంశాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. వారి మూడున్నరేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్‌)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే అవకాశం లభించనుంది. ఇప్పటికే వచ్చిన అఫ్లికేషన్లను పరిష్కరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్‌ నిర్ణయించింది. వారం రోజుల్లోపే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సీసీఎస్‌ వర్గాలు వెల్లడించాయి. దీని కోసం వారు గత మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. సర్కార్‌ నిర్ణయంతో వారి నిరీక్షణలకు తెర పడనుంది.

టీఎస్‌ఆర్టీసీలోని ఉద్యోగులు, కార్మికులు కలిసి రుణపరపతి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెలనెలా వేతనంలోంచి కొంత సొమ్మును ఉద్యోగులు సీసీఎస్‌లో పొదుపు చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీతో రుణం తీసుకుంటారు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పుడు, ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారు అన్నాళ్లు దాచుకున్న సొమ్మంతా వడ్డీతో కలిపి ఉద్యోగులకు వెనక్కి ఇస్తారు. అయితే గత కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న టీఎస్‌ఆర్టీసీ సంస్థ.. ఉద్యోగులు దాచుకున్న డబ్బును వాడేసుకుంది.

దాంతో గత మూడున్నరేళ్లుగా అనగా 2020 అక్టోబరు నుంచి సీఎస్‌ఎస్‌ అఫ్లికేషన్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో సీసీఎస్‌లో 51 వేల మంది సభ్యులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 31 వేలకే పరిమితమైంది. అసలు, వడ్డీ కలిపి ఆర్టీసీ యాజమాన్యం తమకు రూ.1,130 కోట్లు ఇవ్వాలని సీసీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించి ప్రస్తుతానికి రూ.150 కోట్లు చెల్లించింది. కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 10,600 పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

ఇక సీఎస్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తుల్లో.. ఉద్యోగ విరమణ చెందిన వారివి 1000, సభ్యత్వం రద్దు చేసుకున్న ఉద్యోగుల నుంచి 2,800 అఫ్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. లోన్ అఫ్లికేషన్ల కోసం రూ.200 కోట్లు.. రిటైర్మెంటు, సభ్యత్వం రద్దు చేసుకున్నవారికి రూ.90 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. యాజమాన్యం ఇచ్చినవి రూ.150 కోట్లు కాగా.., సీసీఎస్‌ రూ.150 కోట్లను రుణంగా తీసుకుంటోంది. దీంతో దరఖాస్తుదారులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతున్నాయని సీసీఎస్‌ ప్రతినిధి వెల్లడించారు. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.