iDreamPost

కేరళ స్నేక్ బైట్ సీన్ రివర్స్! పాముతో భర్తని చంపించిన భార్య!

  • Author Soma Sekhar Published - 02:07 PM, Sat - 14 October 23
  • Author Soma Sekhar Published - 02:07 PM, Sat - 14 October 23
కేరళ స్నేక్ బైట్ సీన్ రివర్స్! పాముతో భర్తని చంపించిన భార్య!

సినిమాలు చూసి.. అదే స్టైల్లో హత్యలు చేయడం ప్రస్తుతం సమాజంలో ఓ ట్రెండ్ గా మారింది. ఎవరికీ అనుమానం రాకుండా, పక్కా ప్లాన్ తో హత్య చేసి తప్పించుకుపోవాలని చూస్తున్నారు కొందరు వ్యక్తులు. గతంలో కేరళలో జరిగిన స్నేక్ బైట్ న్యూస్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భార్యను చంపడానికి భర్త పామును ఉపయోగించిన ఉదంతం అది. ఈ సంఘటనతో కేరళతో సహా.. దేశం మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ గా మారింది. భార్యే భర్తను పాముతో కాటు వేయించి చంపించింది. సంచలనం రేపిన ఈ సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ప్రవీణ్-లలిత భర్త భార్యలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రవీణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటుగా బిల్డర్ గా పనిచేసేవాడు. అయితే అతడు ఉన్నట్లుండి ఈనెల 9న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గుండెపోటుతో అతడు మరణించినట్లుగా భార్య లలిత పోలీసులకు తెలిపింది. కానీ ప్రవీణ్ తల్లికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అతడి మరణానికి కారణం గుండెపోటు కాదని, భార్య లలితే అతి కిరాతకంగా చంపించిందని పోలీసులు గుర్తించారు. అసలు విషయం ఏంటంటే? ప్రవీణ్ కు గత కొన్నాళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్యకు తెలిసింది. దీంతో ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవి. అయితే ఈ విషయంలో ప్రవీణ్ ప్రవర్తన మారకపోవడంతో.. అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన భర్త వద్దే సెంట్రింగ్ పనులు చేసే మచ్చ సురేశ్ తో చేతులు కలిపింది. తన భర్తను చంపితే ఒక ప్లాట్ ఇస్తానని అతడికి ఆఫర్ చేసింది. దీంతో సురేశ్ తన గ్యాంగ్ తో కలిసి ప్రవీణ్ హత్యకు ప్లాన్ వేశాడు. వీరి ఖర్చుల కోసం లలిత తన దగ్గర ఉన్న 34 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చింది.

అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ నెల 9వ తేదీ రాత్రి రామగుండంలో మద్యం తాగిన సురేష్ గ్యాంగ్ లలితకు ఫోన్ చేసి.. ఇంటికి వచ్చారు. వారు రాగానే తన భర్తను చూపించి ఆమె వేరే గదిలోకి వెళ్లింది. నిందితులు ప్రవీణ్ ముఖంపై దిండుతో అదిమి పట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి.. పాముతో కాటు వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ తన ప్రవీణ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో డొంక మెుత్తం కదిలింది. పోలీసుల విచారణలో మర్డర్ ప్లాన్ బయటపడటంతో.. భార్య లలితతో సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి