nagidream
Telugu Person As SBI New Chairman: ఒకప్పుడు ప్రొబేషన్ ఆఫీసర్ గా పని చేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఎస్బీఐ ఛైర్మన్ అయ్యే స్థాయికి ఎదిగారు. ఆయన తెలుగు వ్యక్తి కావడం మరో విశేషం.
Telugu Person As SBI New Chairman: ఒకప్పుడు ప్రొబేషన్ ఆఫీసర్ గా పని చేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఎస్బీఐ ఛైర్మన్ అయ్యే స్థాయికి ఎదిగారు. ఆయన తెలుగు వ్యక్తి కావడం మరో విశేషం.
nagidream
దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలుగు వ్యక్తి అయినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన ప్రస్తుతం ఎస్బీఐ ఎండీగా ఉన్నారు. ఎస్బీఐ ఛైర్మన్ పోస్టుకి ఈయనను కేంద్ర పరిధిలో ఉండే స్వయంప్రతిపత్తి సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఛైర్మన్ పోస్ట్ కోసం జూన్ 29న ముగ్గురిని ఇంటర్వ్యూ చేసింది ఎఫ్ఎస్ఐబీ ప్యానెల్. కాగా ముగ్గురిలో చల్లా శ్రీనివాసులని ఎంపిక చేసింది ప్యానెల్. ఆయనను ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. ప్రభుత్వ యాజమాన్యంలో బ్యాంకులు సహా ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం ప్రతిభావంతులను ఎంపిక చేయడమే ఎఫ్ఎస్ఐబీ పని.
అనుభవం, పని తీరుని బట్టి సరైన వ్యక్తులను కేంద్రానికి సిఫారసు చేస్తుంది. ఈ క్రమంలో ఎస్బీఐ నూతన ఛైర్మన్ గా అన్ని అర్హతలు కలిగిన వ్యక్తిగా చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేసింది. పని తీరు, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛైర్మన్ పదవికి ఆయనను సిఫారసు చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ ఛైర్మన్ గా దినేష్ కుమార్ ఖరా ఉన్నారు. 2020 అక్టోబర్ 7న ఛైర్మన్ గా ఎంపికయ్యారు. ఆయన పదవీకాలం గత ఏడాదిలోనే ముగిసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో పదవీకాలాన్ని పొడిగించింది. ఆయనకు 63 ఏళ్ళు వచ్చే వరకూ అంటే ఆగస్టు 28 వరకూ ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. ఈయన రిటైర్మెంట్ తర్వాత కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించినప్పటికీ మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. చల్లా శ్రీనివాసులు శెట్టి విషయానికొస్తే.. ఈయన తెలంగాణ వ్యక్తి. ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో జన్మించారు. అక్కడే స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి వరకూ చదివారు. ఆ తర్వాత హైస్కూల్, ఇంటర్మీడియట్ గద్వాలలో పూర్తి చేశారు. రాజేంద్రనగర్ లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన చల్లా శ్రీనివాసులు.. ఆ తర్వాత 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేరారు. తొలుత గుజరాత్ అహ్మదాబాద్ లో పని చేసిన ఈయన.. ఆ తర్వాత హైదరాబాద్, బాంబేలో పని చేశారు. బ్యాంకింగ్ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అయితే ఈయన సివిల్స్ రాకపోవడంతో బ్యాంకింగ్ రంగంలోకి వచ్చానని గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. అలా వచ్చిన ఆయన ఈ ఫీల్డ్ లోనే నిలదొక్కుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఛైర్మన్ అయ్యే స్థాయికి వచ్చారు.