P Venkatesh
మీరు వ్యవసాయ సాగులో డ్రోన్స్ ఉపయోగించి మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా? మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు మారుత్ డ్రోన్స్ ముందుకొచ్చింది. రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనుంది.
మీరు వ్యవసాయ సాగులో డ్రోన్స్ ఉపయోగించి మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా? మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు మారుత్ డ్రోన్స్ ముందుకొచ్చింది. రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనుంది.
P Venkatesh
భారత దేశం వ్యవసాయాధారిత దేశం. దేశ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశాభివృద్ధిలో కూడా వ్యవసాయం ఎంతో కీలకంగా మారింది. రైతన్నలకు సాగు భారం కాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ వాతావరణలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల పంటలకు అనేక చీడపీడలు అంటుకుంటున్నాయి. దీంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం దేశ ఆహార భద్రతపై పడుతుంది. దీన్ని అధిగమించేందుకు వ్యవసాయ సాగులో ఆధునిక పద్దతులను ప్రవేశ పెడుతున్నారు. నూతన రకాల వంగడాలను అభివృద్ధి చేసి పంట ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేస్తున్నారు.
అంతేకాకుండా సాగు వ్యయాలను తగ్గించేందుకు యాంత్రీకరణ పెంచాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మలిచేందుకు పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో వ్యవసాయ సాగులో వినియోగించే యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తున్నారు. డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాయి. దుక్కి దున్నడం మొదలుకొని పంట చేతికొచ్చే వరకు అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సాగు వ్యయం తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతున్నాయి.
భారత్ లో కూడా వ్యవసాయసాగులో అనేక మార్పులు సంభవించాయి. రైతులు యంత్ర పరికరాలను విరివిగా వినియోగిస్తున్నారు. పంటలకు వచ్చే చీడపీలను అరికట్టేందుకు పిచికారి చేయడానికి అనేక రకాల స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు డ్రోన్ల ద్వారా కూడా పిచికారి చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ఈ డ్రోన్ల వినియోగంపై హైదరాబాద్ కు చెందిన మారుత్ డ్రోన్స్ మహిళలకు ఉచితంగా శిక్షణను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే శిక్షణను పూర్తి చేసుకుని డ్రోన్ ఫ్లైయింగ్ చేస్తూ నెలకు రూ. 40 వేలపైనే సంపాదించుకోవచ్చు.
ఇటీవలే ఈ సంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారుచేసేందుకు డీజీసీఏ అనుమతులు పొందింది. మారుత్ డ్రోన్స్ తయారుచేసిన ‘ఏజీ 365ఎస్ కిసాన్‌డ్రోన్’ (మల్టీయుటిలిటీ అగ్రికల్చర్ స్మాల్ కేటగిరీ డ్రోన్) ద్వారా మరింత మందికి డ్రోన్ ఫ్లైయింగ్‌లో శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. డ్రోన్స్ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లకు, రైతులతోపాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్ లైసెన్సులు అందజేస్తోంది. దీంతో పంట పొలాల్లో మందు పిచికారీ సులభం అవుతుంది. రైతులకు పొలాల వద్దే శిక్షణ అందిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ వెల్లడించారు.
మహిళలు, మహిళా రైతులకు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పూర్తైన మహిళలు,రైతులు రోజూ డ్రోన్‌లను నడుపుతూ రూ.1500 వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు. డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే రూ.10లక్షల వరకు, సర్వీస్ ప్రొవైడర్లకు రూ.2కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 50-100 శాతం సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందన్నారు.
డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ చేయాలనుకునే వారికి 18 ఏళ్ల వయసు, పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. దాదాపు రెండు వారాల్లో ఫ్లైయింగ్‌లో ట్రైనింగ్ పొందిన తర్వాత ఇన్‌స్ట్రక్టర్లు, సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పది సంవత్సరాల వ్యవధి ఉన్న లైసెన్సులు జారీ చేస్తారు.