iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ఫ్రీ హలీం.. ఏకంగా పోలీసులు లాఠీ ఛార్జ్

ఉచితం.. ఉచితం.. ఉచితం అని ఓ రెస్టారెంటో, వస్త్రాల దుకాణమో ఆఫర్ ప్రకటించగానే.. పొద్దున్నే అక్కడి వాలిపోతుంటారు ప్రజలు. తాజాగా ఓ హోటల్ ఫ్రీ హలీం అని ప్రకటించగానే..

ఉచితం.. ఉచితం.. ఉచితం అని ఓ రెస్టారెంటో, వస్త్రాల దుకాణమో ఆఫర్ ప్రకటించగానే.. పొద్దున్నే అక్కడి వాలిపోతుంటారు ప్రజలు. తాజాగా ఓ హోటల్ ఫ్రీ హలీం అని ప్రకటించగానే..

హైదరాబాద్‌లో ఫ్రీ హలీం.. ఏకంగా పోలీసులు లాఠీ ఛార్జ్

ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగుతామన్న సరదా మాటలను క్యాష్ చేసుకుంటున్నారు కొంత మంది. తమ బిజినెస్ అభివృద్ధి కోసం దీన్నొక టెక్నిక్‌గా వాడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు ఇలాంటి ఆఫర్లు ఉంటే అస్సలు వదులుకోరు. లులు మాల్ ఓపెనింగ్ రోజు.. తీర్థయాత్రకు, తిరనాళ్లకు వచ్చినట్లు వచ్చారు భాగ్యనగర ప్రజలు. బిల్లు కట్టకుండా ఆహార పదార్ధాలు తిన్న వీడియోలు అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా. మొన్నటికి మొన్న మాదాపూర్‌లో ఓ బిర్యానీ హోటల్ ప్రారంభం సందర్భంగా.. ఫ్రీ అని పెడితే.. పొద్దున్నే పరుగులు పెట్టారు. ఇక రూపాయికే కిలో చికెన్, 10 రూపాయిలకే రుచికరమైన బిర్యానీ అంటే.. జనాలు ఎగబడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి.

తాజాగా హలీం ఫ్రీగా అందిస్తామన్న ప్రకటనతో నగర వాసులంతా ఆ దుకాణం ముందు వాలిపోయారు. రంజాన్ మాసం ఈనెల 12న మొదలైంది. రంజాన్ అనగానే బిర్యానీతో పాటు హలీం కూడా ఫేమస్. రంజాన్ నెలలో దొరికే హలీమ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. ఈ ఇష్టాన్నే ఓ షాప్ క్యాష్ చేసుకుంది. హైదరాబాద్..మలక్ పేట్- ముసారాంబాగ్ మధ్యలో ఉన్న అజేబో హోటల్.. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా తొలి రోజు ఫ్రీ హలీం ఆఫర్ పెట్టింది. అదీ కూడా రాత్రి 7 నుండి 8 గంటల మధ్య సమయంలో అని చెప్పడంతో.. కరువా కాటకమా అన్నట్లు జనాలు ఎగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. విపరీతంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మలక్ పేట నుండి దిల్ సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

హోటల్ వద్ద వందలాది మందిని చూసేసరికి ఖంగుతిన్న హోటల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందించింది. ఆ జనాలను కంట్రోల్ చేయడం పోలీసులు తరం కూడా కాలేదు. దీంతో లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రీ హలీమ్ కోసం వస్తే.. ఫ్రీగా దెబ్బలు తినాల్సి వచ్చింది జనాలు. వారిని అదుపు చేసేందుకు తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది పోలీసులకు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాగా, సందంట్లో సడేమియాలా చేతివాటం ప్రదర్శించారు కస్టమర్ల వేషంలో వచ్చిన దొంగలు. కొంత మంది డబ్బులు పోగొట్టుకున్నట్లు వాపోయారు. ఉచితంగా హలీం దొరికిన వాళ్లు పండగ చేసుకుని ఇంటికి వెళ్లగా.. మరికొంత మంది దొరక్క ఊసురుమంటూ తిరిగి ఇంటికి చేరారు. మొత్తానికి ఈ ఉచిత ఆఫర్.. ఆ హోటల్ కొంపముంచినట్లైంది.