Krishna Kowshik
అమ్మను మించిన దైవం లేదంటారు. దేవతలా చూసుకోవాల్సిన తల్లిని.. మీసాలు వచ్చాక తిండి పెట్టకుండా నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధురాలికి ఇదే అనుభవం ఎదురైంది.. చివరకు..
అమ్మను మించిన దైవం లేదంటారు. దేవతలా చూసుకోవాల్సిన తల్లిని.. మీసాలు వచ్చాక తిండి పెట్టకుండా నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధురాలికి ఇదే అనుభవం ఎదురైంది.. చివరకు..
Krishna Kowshik
మహిళకు మాతృత్వం మరో జన్మ అంటుంటారు. తాను చనిపోతానని తెలిసి కూడా తన కడుపులో బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయదు తల్లి. అమ్మ అనే పిలుపు కోసం తాపత్రయం పడిపోతూ ఉంటుంది. అందుకే అమ్మను మించిన యోధులు, దైవం లేదంటారు. తన కడుపు కూడా చూసుకోకుండా.. పిల్లల ఆకలి తీరుస్తుంది. బిడ్డలకు చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా తల్లడిల్లి పోతుంది. పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ఎన్నో త్యాగాలు చేస్తుంది. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి, ముసలి తల్లీదండ్రులకు అండగా నిలవాల్సిన పిల్లలు.. ఆస్తులు పంచుకుని వారిని నడిరోడ్డుపైనా వదిలేస్తున్నారు. దీంతో కాస్తంత చోటు, పిడికెడు బువ్వ కోసం చేతులు చాస్తున్నారు. ఇదే జరిగింది తెలంగాణలో. అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాల నాడా అన్న సామెతను నిజం చేసి చూపించారు నలుగురు కొడుకులు.
నలుగురు కొడుకుల్ని కని ప్రయోజకులను చేసిందో తల్లి. కానీ చివరకు ఆమెను పెంచేందుకు ఆ నలుగురికి మనస్సు రాలేదు. చివరకు ఆమెను ఓ గుడిసెలో ఉంచి.. చేతులు దులుపుకున్నారు. బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా మాడ్చేస్తున్నారు. దీంతో తనకు తిండిపెట్టే దిక్కులేక, తనను ఆదరించే తోడు లేక చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన కరీం నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వేముల నర్సమ్మకు నలుగురు కొడుకులు. నలుగుర్ని ప్రయోజకుల్ని చేసింది. తన, తన భర్త రెక్కల కష్టం మీద వచ్చిన సొమ్ముతో నలుగురు కొడుకులకు ఇళ్లు కట్టించింది. అలాగే పెళ్లిళ్లు చేసింది. పొలం కూడా నలుగురి పేరు మీద రాసిచ్చింది. అన్ని తీసుకున్నాక కుమారుల్లో స్వార్థం పేరుకుపోయింది. తండ్రి చనిపోగా.. తల్లి నర్సమ్మను పెంచే బాధ్యతను నలుగురు పంచుకోవాల్సి పోయింది. ఆమెను చివరకు ఒంటరి చేశారు.
తల్లిని ఓ గుడిసెలో ఉంచి.. తిండి పెట్టడం మానేశారు. అదే గ్రామంలో ఉంటూ.. కనీసం ఆమెను పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో స్థానికులు దయతలచి ముద్ద వేస్తేనే ఆమె కడుపు నింపుకుంటుంది. ఎప్పటికైనా కొడుకులు రాకపోతారా..తనను తీసుకెళ్లకపోతారా అని ఎదురు చూసింది కానీ..అమ్మ కన్నా ఆస్తులే ముఖ్యమని భావించిన వాళ్లు తల్లిని చూడటం మానేశారు. చివరకు తట్టుకోలేక కరీం నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన కొడుకులు చూడటం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె నుండి ఫిర్యాదు తీసుకున్నారు. అయితే వారితో పిలిపించి మాట్లాడతానని హామీ ఇవ్వడంతో నర్సమ్మ అక్కడ నుండి ఇంటికి చేరుకుంది. పున్నామ నరకం నుండి తప్పిస్తాడని ఆశపడే ఎంతో మంది తల్లీదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు కొడుకులు అనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ.
కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్దురాలు
కరీంనగర్ – నా నలుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పంచేశాను.. నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ.. పోలీస్ స్టేషన్లో… pic.twitter.com/XA1o9HaTZq
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2024