SNP
SNP
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల కోసం 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలను బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారు అని అంతా భావించినా.. పార్టీ అధిష్టానం అక్కడి సిట్టింగ్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డినే తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తుమ్మల వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తుమ్మల మళ్లీ యాక్టివ్ అయ్యారు.
కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న తుమ్మల.. తాజాగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లి, తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరుతున్న సమయంలో కొంత భావోద్వేగానికి గురైన తుమ్మల.. కంటతడి పెట్టుకున్నారు. అయితే.. తుమ్మల ఖమ్మంలో తన అనుచరులతో ఏర్పాటు చేస్తున్న సమావేశంతో ఒక్కసారిగా మళ్లీ ఖమ్మం రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఆ జిల్లాలో బీఆర్‌ఎస్ కాస్త బలహీనపడిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తుమ్మల కూడా తన అనుచరులతో ప్రత్యేక మీటింగ్ పెట్టుకోవడంతో.. మరింత గందరగోళం నెలకొంది.
సంచలన నిర్ణయం ఏదైనా తీసుకోబోతున్నారా అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది. 1983లో టీడీపీ తరఫున సత్తుపల్లి నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిన తుమ్మల.. 1985, 1994, 1999ల్లో అదే స్థానం నుంచి గెలుపొందారు. 2009లో ఖమ్మం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో ఓటమి పాలైన తుమ్మల.. టీఆర్‌ఎస్‌లో(ఇప్పటి బీఆర్‌ఎస్) చేరి మంత్రిగా పనిచేశారు. 2016లో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఉప ఎన్నికలో ఆ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ, 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో.. ఈ సారి ఆయనకే టిక్కెట్ దక్కింది. దీంతో తుమ్మల తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: ఆ ఘటన అనుకోకుండా జరిగింది.. నన్ను క్షమించండి: మంత్రి తలసాని శ్రీనివాస్