iDreamPost
android-app
ios-app

3 ఏళ్ల చిన్నారిని బలి తీసుకున్న స్కూల్ బస్

అమ్మా నేను స్కూల్ వెళ్లి వస్తా అంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ బస్సు ఎక్కింది కూతురు. కానీ కాసేపటికే కూతురు లేదంటూ సమాచారం అందింది. హుటాహుటిన వెళ్లి చూడగా.. బస్సు చక్రాల కింద నలిగిపోయింది చిన్నారి ప్రాణం..

అమ్మా నేను స్కూల్ వెళ్లి వస్తా అంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ బస్సు ఎక్కింది కూతురు. కానీ కాసేపటికే కూతురు లేదంటూ సమాచారం అందింది. హుటాహుటిన వెళ్లి చూడగా.. బస్సు చక్రాల కింద నలిగిపోయింది చిన్నారి ప్రాణం..

3 ఏళ్ల చిన్నారిని బలి తీసుకున్న స్కూల్ బస్

బిడ్డను బాగా చదివించాలి.. ఆమె కోరిందల్లా ఇవ్వాలని ఎన్నో కలలు కన్నారు తల్లిదండ్రులు. ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నారు. అందుకోసమే తండ్రి పరాయి దేశానికి వెళ్లి పనులు చేస్తూ కుటుంబానికి దూరమయ్యాడు. బుడి బుడి అడుగులతో, బుజ్జి బుజ్జి మాటలతో తమ ఇంట్లో ఆనందాన్ని నింపేస్తోంది కూతురు మనోజ్ఞ (3). పాపకు మూడేళ్లు రావడంతో ఇటీవల చిన్నారిని నర్సరీలో చేర్పించింది తల్లి. రోజు బడికి వెళ్లి.. నేర్చుకున్న పాటలు, పాఠాలు చెబుతుంటే మురిసిపోయింది. దూరాన ఉన్న భర్తకు చెప్పి పొంగిపోయింది. రోజూలానే ఈ రోజు కూడా పొద్దున్నే ఎగురుకుంటూ, గెంతులేసుకుంటూ బడికి వెళ్లింది మనోజ్ఞ. సాయంత్రం ఇంటికి వస్తుంది అని ఎదురు చూస్తున్న తల్లికి ఆమె చావు కబురు చేరింది. బస్సు కింద పడి పాప చనిపోయిందన్న వార్త తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే పాప చదువుతున్న స్కూల్ వెళ్లగా.. రక్తంలో తడిసిన పాపను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. ఆమె ఆవేదన, ఆక్రందన చూసి కంటతడి పెట్టుకున్నారు బంధువులు.

ఓ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా.. ముక్కుపచ్చలారని ఓ చిన్నారి మనోజ్ఞ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సు కింద పడి నర్సరీ చదువుతున్న పాప చనిపోయింది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. నామాపూర్‌కి చెందిన భూమయ్య, వెంకటవ్వల కూతురు మనోజ్ఞ ముస్తాబాద్‌లోని మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నర్సరీ చదువుతుంది. భూమయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వర్క్ చేస్తున్నాడు. తల్లి వ్యవసాయ కూలీ. రోజులానే కూతుర్ని రెడీ చేసి.. స్కూల్ బస్సు ఎక్కించింది తల్లి వెంకటవ్వ. తన పనిలో పడిపోయింది.. కానీ ఆమె కూతురు చనిపోయిందంటూ వార్త చేరింది. స్కూల్ వద్దకు వెళ్లి చూడగా.. చక్రాల కింద పడి చనిపోయిన కూతురు మనోజ్ఞ చూసి ఒక్కసారిగా కూలబడిపోయింది.

బస్సు దిగిన తర్వాత పాపను చూడని డ్రైవర్.. చిన్నారి మీద నుండి వాహనాన్ని పోనిచ్చాడు. మనోజ్ఞ తలపై నుంచి బస్ టైర్ వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయింది. కూతురిపై ఎన్నో ఆశలతో బతుకుతున్న తండ్రికి ఏమీ చెప్పాలంటూ గుండెలవిసేలా రోదించింది. సాయంత్రం ఇంటికి వస్తావనుకుంటే.. ఇలా కనిపిస్తావనుకోలేదు అంటూ ఏడుస్తోంది. నాన్నకు ఏమని చెప్పాలమ్మా అంటూ కన్నీరు కారుస్తుంటే.. ఆమె ఆవేదన చూసి ఓదార్చడం బంధువులు, స్థానికుల తరం కావడం లేదు. కాగా, స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల పాఠశాల బస్సు కింద పడి చనిపోయిందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు అందింది. ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భర్తను ఉపాధి పేరుతో దూరం చేస్తే.. బిడ్డను శాశ్వతంగా దూరమై ఆ తల్లికి కడుపుకోత మిగుల్చింది. బాధ్యతారాహిత్యంగా వాహనాన్నినడిపి.. మూడేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు డ్రైవర్.