iDreamPost

కష్టానికి ఫలితం.. ఒకే కుటుంబం నుంచి నలుగురు కానిస్టేబుళ్లుగా ఎంపిక

కష్టానికి ఫలితం.. ఒకే కుటుంబం నుంచి నలుగురు కానిస్టేబుళ్లుగా ఎంపిక

ఎన్నో రోజులుగా కానిస్టేబుల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిన్న కానిస్టేబుల్ తుది ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కాగా ఈ ఫలితాల్లో పలువురు పేదింటి బిడ్డలు మెరిసారు. ఓ కుటుంబంలో కానిస్టేబుల్ ఉద్యోగాల జాతర కనబడింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే కుటుంబంలో నలుగురు అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో కష్టంతో కూడుకున్నదనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విపరీతమైన కాంపిటీషన్ ఏర్పడింది. అంతటి పోటీతత్వంలో కూడా ఓ కుటుంబానికి చెందిన నలుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి విజయ దుందుభి మోగించారు. ఈ అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మాలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నలుగురికి ఒకేసారి ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మొక్కవోని దీక్షతో, అంకితభావంతో అహర్నిషలు కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వీరిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి