iDreamPost
android-app
ios-app

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత

  • Published Jan 29, 2024 | 10:20 AM Updated Updated Jan 29, 2024 | 10:20 AM

P Narsa Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..

P Narsa Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..

  • Published Jan 29, 2024 | 10:20 AMUpdated Jan 29, 2024 | 10:20 AM
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి (92) సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయితే ఆయన గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో నర్సారెడ్డి తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్‌ మాజీ మంత్రి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నర్సారెడ్డి నేపథ్యం..

ఇక నేడు తుది శ్వాస విడిచిన నర్సారెడ్డి వ్యక్తిగత వివరాలు విషయానికి వస్తే.. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామం. 1931, సెప్టెంబర్ 22న నర్సారెడ్డి జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించారు. దీనిలో భాగంగా ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. యువకుడిగా ఉన్న సమయంలో ఆయన భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నారు. అంతేకాక నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేసే పోరాటంలో కూడా పాలు పంచుకున్నారు నర్సారెడ్డి. 1971 నుంచి 1972 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలందించారు.

1978 ఎన్నికల తర్వాత.. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రివర్గంలో నర్సారెడ్డి నీటి పారుదల శాఖ, రెవెన్యూ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. వరుసగా 1967 నుంచి 1982 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1991లో ఆదిలాబాద్ ఎంపీగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా కొనసాగారు.

ఆ తర్వాత క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇంటి వద్దనే ఉంటూ కుటుంబంతో సమయం గడిపేవారు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. ఇక సోమవారం నాడు నర్సారెడ్డి అదే నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై అభిమానులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఆయన ఎందరికో ఆదర్శం అంటున్నారు.