Revanth Reddy: ఖమ్మం వరదలకు కారణమిదే.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy-Khammam Floods: తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఖమ్మం వరదలకు గల కారణాలను వివరించారు.

CM Revanth Reddy-Khammam Floods: తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఖమ్మం వరదలకు గల కారణాలను వివరించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఈ వర్షాలకు ఖమ్మం జిల్లా కకావికలం అయ్యింది. మున్నేరు వరద ఖమ్మానికి తీరని కన్నీరు మిగిల్చింది. ప్రాణ నష్టంతో పాటు.. వందల సంఖ్యలో మూగజీవాలు కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో పంట మునిగిపోయింది. ఇళ్లు కూలిపోయి.. సర్వం కోల్పోయి వేల సంఖ్యలో జనాలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ మాట్లాడుతూ.. ఖమ్మం వరదలకు గల కారణాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వేల మంది నిరాశ్రయులుగా మారారు. మున్నేరు వరద ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్.. ఆక్రమణల వల్లే ఖమ్మం పట్టణాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవని ప్రస్తుతం అవి చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయన్నారు.

పట్టణంలో వరదలకు కారణమైన మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచే విషయంపై ఇంజనీర్లతో చర్చిస్తామని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే.. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ కాకతీయకు తెరతీసిందని ఇదే విషయాన్ని అప్పటి మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేస్తే.. ఇప్పుడు అవి ఎందుకు తెగుతున్నాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వరదలపై మాజీ మంత్రి హరీశ్‌ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ హాస్పిటల్ కట్టారని.. వాటిని తొలగించమని హరీశ్.. పువ్వాడకు చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో తమ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించటం వల్లే ప్రాణనష్టం తగ్గించగలిగామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. వరద బాధితులను ఆదుకోవాలని.. కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశామని వారి నుంచి స్పందన రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. ఇక వరదల్లో కొట్టుకోపోయి ప్రాణాలు కోల్పోయిన మహబూబాద్ జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని సీఎం రేవంత్ పరామర్శించారు. అశ్విని కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.

Show comments