iDreamPost
android-app
ios-app

ఎన్నికల ముందు KCR చారిత్రాత్మక నిర్ణయం.. ఇక వారంతా ప్రభుత్వ ఉద్యోగులే!

  • Published Jul 24, 2023 | 8:54 AM Updated Updated Jul 24, 2023 | 8:54 AM
  • Published Jul 24, 2023 | 8:54 AMUpdated Jul 24, 2023 | 8:54 AM
ఎన్నికల ముందు KCR చారిత్రాత్మక నిర్ణయం.. ఇక వారంతా ప్రభుత్వ ఉద్యోగులే!

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా విజయం సాధించి.. హ్యాట్రిక్‌ కొట్టాలని కేసీఆర్‌ సర్కార్‌ బలంగా నిశ్చయించుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ అడుగులు ముందుకు వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం నాడు దివ్యాంగుల పెన్షన్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక విద్యార్థుల డైట్‌ ఛార్జీల పెంపుతో పాటు త్వరలోనే ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల ముందు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా కేసీఆర్‌ సర్కార్‌ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ముందు కేసీఆర్‌ సర్కార్‌ చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వారికి భారీ శుభవార్త చెప్పింది.

సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం అనగా జూన్‌ 23న కేసీఆర్‌.. వీఆర్‌ఏలతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశం తర్వాత.. కేసీఆర్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని పర్మినెంట్‌ ఉద్యోగులుగా చేస్తూ.. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వీరిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అర్హతలను బట్టి పోస్టింగ్‌..

వీఆర్ఏల అర్హతలను బట్టి.. వారిని మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖల్లో సర్దుబాటు చేయటమే కాకుండా.. వాళ్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను నేడు అనగా సోమవారం రోజున విడుదల చేయాలంటూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారికి ఆదేశాలిచ్చారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై వీఆర్ఏలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు మారిన పరిస్థితుల కారణంగా.. వీఆర్ఏల వృత్తికి ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో.. వారి కోసం రెవిన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసి.. వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కారుణ్య నియమాకాలు..

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. కాగా.. వీరిలో చదువుకోని వారితో పాటు.. 7, 10వ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఆపై చదువులు కూడా చదివినవాళ్లు ఉన్నారు. అయితే.. వీళ్లకున్న విద్యార్హతలను బట్టి ఉద్యోగ కేటగిరిని నిర్ధారించాలని.. నిబంధనలకు అనుగుణంగా వీరిని ఆయా శాఖల్లో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని ఆయా పోస్టుల్లో భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.

వీఆర్‌ఏలను పర్మినెంట్‌ చేయడమే కాక.. 61 సంవత్సరాలు పైబడి, సర్వీసులో మరణించిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు, వీఆర్ఏల వారసుల విద్యార్హతలకు సంబంధిచిన వివరాలను సేకరించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కాగా.. చాలా రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల వివాదానికి నేటితో ఓ తెరపడింది. తమను పర్మినెంట్‌ ఉద్యోగులుగా మారుస్తూ.. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై వీఆర్‌ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.