Dharani
తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. కోడి ధర కొండెక్కి కూర్చుంది. ఎంత పెరిగింది అంటే..
తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. కోడి ధర కొండెక్కి కూర్చుంది. ఎంత పెరిగింది అంటే..
Dharani
ఒకప్పుడు ఇంటికి బంధువులు వస్తేనో.. లేదంటో పండగో, ఇతర శుభకార్యాల వేళ మాత్రమే మాంసాహారం వండేవారు. మరి ఇప్పుడో కాలం మారింది. కొందరైతే ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు మాంసాహారమే తీసుకుంటారు. రోజులో కనీసం ఒక్క పూటైనా ముక్క తినేవారు చాలా మందే. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఎక్కువగా బుక్ చేసేది బిర్యానీయే. ఇక మాంసాహారంలోనూ చికెన్‌కే అగ్రస్థానం ఇస్తారు మన వాళ్లు. వారంలో ఏడు రోజులు నీసు తినేవారు ఎందరో ఉన్నారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం కచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఆదివారం నాడు నగరాల్లో చికెన్ క్వింటాల్లాలో అమ్ముడవుతుంటుంది. ఇక గత కొన్ని రోజులుగా సామాన్యులకు అందుబాటులో ఉన్న కోడి ధర.. రెండు వారాల నుంచి భారీగా పెరుగుతోంది. ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ వివరాలు..
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. పైగా మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. మరి చికెన్ ధర ఇంతలా పెరగడానికి కారణం ఏంటి అంటే.. మండుతున్న ఎండలు. వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని.. మార్చి, ఏప్రిల్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు వ్యాపారులు. కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. మొన్నటి వరకు 7 రూపాయలు పలికిన గుడ్డు రేటు.. ఇప్పుడు రూ.5కు దిగి వచ్చింది.
కార్తీక మాసం సమయంలో చికెన్ ధర భారీగానే దిగి వచ్చింది. నెల రోజుల క్రితం వరకు కూడా కిలో చికెన్ రేటు రూ.200 లోపే ఉంది. ఇక కార్తీకమాసం సమయంలో అయితే కిలో చికెన్ రూ.130-140 కే అమ్మాల్సి వచ్చింది. దాంతో చాలా మంది కోళ్ల ఫారాల యజమానులు భారీగా నష్టపోయారు. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. తల్లికోళ్లను కూడా గిట్టుబాటు కాక తక్కువ ధరకే అమ్మేశారు. అప్పటి ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. కోళ్ల పెంపంక తగ్గించడంతో.. ఇప్పుడు వాటి ఉత్పత్తి తగ్గి.. కొరత ఏర్పడింది. దాంతో కోడి ధర కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ రేటు రూ.300 పలుకుతుంది. ఆదివారం వస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
వాతావరణంలో మార్పుల కారణంగా కోడిపిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదొక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు. అంతేకాక ప్రతి ఏటా వేసవిలో చికెన్, మటన్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో మటన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌తో సహా పలు జిల్లా కేంద్రాల్లో కిలో మటన్ రూ.1000 చొప్పున అమ్ముతున్నారు.