PV Narasimha Rao: బ్రేకింగ్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

కేంద్రం కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ ఒకరికి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆ వివరాలు..

కేంద్రం కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ ఒకరికి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆ వివరాలు..

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహరావుకు భారతరత్న అవార్డు ప్రకటించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. తాజాగా కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఒకేసారి ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించారు. వారిలో పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, హరితవిప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామి నాథన్‌, ఎల్‌కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. భారతరత్న అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహరావు చరిత్ర సృష్టించారు. పీవీకి భారతరత్న ప్రకటించడంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారతరత్న దేశంలోనే అత్యున్నత పురస్కారం. వేర్వేరు రంగాల్లో.. జాతి, వృత్తి, లింగ, స్థాయి బేధాలు చూడకుండా.. విశేష సేవలు చేసిన వారికి అందజేస్తారు. అయితే దీన్ని కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నియమం ఏం లేదు. విదేశీయులు, భారత పౌరసత్వం పొందిన వారికి కూడా ఇవ్వొచ్చు. ఈ అవార్డు ప్రారంభించిన 70 ఏళ్ల తర్వాత తొలిసారి తెలుగు వ్యక్తి పీవీ నరసింహరావుకు భారతరత్న అవార్డు వచ్చింది.

పీవీ ప్రస్థానం..

పీవీ నరసింహరావు తెలంగాణలోని వరంగల్‌ జిల్లా, నర్సంపేట మండలం, లక్నేపల్లి గ్రామంలో 1921, జూన్‌ 28న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు జన్మించాడు. తరువాత పాత కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవడంతో పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడి.. ఓయూ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఇదే కాక దేశ స్వాతంత్య్రోద్యమంలోనూ, హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో కూడా పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌లతో కలిసి పనిచేశారు.

1957 లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం ద్వారా పీవీ రాజకీయజీవితం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్రమంత్రిగా, ఆపై 1971 సెప్టెంబరు 30 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991-96 వరకు భారతదేశానికి 9వ ప్రధానిగా సేవలందించారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా పీవీ గుర్తింపు పొందారు.

ఇక పీవీ ప్రధానిగా చేసిన కాలంలో ఇండియాను తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశారు. నాటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. దివాలా తీసిన దేశాన్ని రక్షించి.. సంస్కరణలు అమలు చేసి.. ప్రంపచీకరణ కోణాన్ని ప్రారంభించారు. ఇదే కాక బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన ఈయన హయాంలోనే జరిగింది.

కాంగ్రెస్ నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించిన ఘనత పీవీకే దక్కింది. రాజకీయాల్లోనే కాక.. సాహిత్యం, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి భిన్న రంగాల్లో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అంతేకాక పీవీకి అనేక భాషలపైపట్టుంది. ఇక ఆయన దేశానికి చేసిన సేవలకు గాను.. కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహరావుకు ఫిబ్రవరి 9, 2024న భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.

Show comments