Dharani
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌కు థాంక్స్ చెబుతున్నారు. ఎందుకు అంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌కు థాంక్స్ చెబుతున్నారు. ఎందుకు అంటే..
Dharani
బీఆర్‌ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆయన చేసిన మేలును మర్చిపోలేము అంటున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. దేశ చరిత్రలో తొలిసారి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) కానిస్టేబుళ్ల నియమాకం కోసం నిర్వహించిన పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెనక మాజీ సీఎం కేసీఆర్ కృషి ఉంది. ఎలా అంటే గతేడాది వరకు కూడా సీఎపీఎఫ్ పరీక్షను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఈ పరీక్ష రాసే సమయంలో ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకునేవారు. కొన్ని ప్రశ్నలు అర్థం కాక వదిలేసేవారు. దాంతో చాలా మంది ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు.
ఇలా హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల చాలా మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఈ అంశంపై తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కేసీఆర్ పీఎం మోదీ, అమిత్ షాతో కలిసి సీఏపీఎఫ్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పరీక్షలను ప్రాంతీయ భాషలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు కూడా సమాచారం చేరవేసింది. ఇక దేశంలోని 128 నగరాల్లో ఈనెల 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించే పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కేంద్ర నిర్ణయంతో వారికి మేలు జరగనుంది.
జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలన్నింటిని హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గతంలో పలు సార్లు కేంద్రానికి లేఖలు రాశారు. కేసీఆర్‌తో పాటు మిగతా రాష్ట్రాలు కూడా గళం కలపటంతో.. ఎట్టకేలకు కేంద్రం ఈ విజ్ఞప్తిపై స్పందించి. త్వరలోనే నిర్వహించే సీఏపీఎఫ్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది.
ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే నిర్వహించబోయే సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షా పత్రాలు.. హిందీ, ఇంగ్లీషుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో తయారు చేశారు. ఈసారి నుంచి 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తుండటంతో.. వచ్చే నోటిఫికేషన్‌కు మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర నిర్ణయం నేపథ్యంలో నిరుద్యోగులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.