సాయిచంద్‌, జగదీశ్‌ కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ భారీ ఆర్థికసాయం

ఇటీవల మరణించిన బీఆర్‌ఎస్‌ నేతలు సాయిచంద్‌, కుసుమ జగదీశ్‌ కుటుంబాలను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబాలకు రూ.కోటిన్నర్‌ ఆర్థికసాయం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్‌, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ మరణం పార్టీకి ఎంతో తీరని లోటన్నారు. ఇద్దరి అకాల మరణంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కలత చెందారని తెలిపారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఒక నెల జీతం మొత్తం కలిపి రూ.3 కోట్లను వారి కుటుంబాలకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 3 కోట్లలో కోటిన్నర జగదీశ్‌ కుటుంబానికి, కోటిన్నర సాయిచంద్‌ కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. తమ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సాయిచంద్‌ సతీమణి రజిని నియమిస్తున్నామని వెల్లడించారు. మృతి చెందిన నాయకుల కుటుంబాలను ఈ విధంగా ఆదుకోవడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments