iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ఆ 2 పథకాలు బాగున్నాయ్‌: KCR

  • Published Apr 24, 2024 | 8:02 AM Updated Updated Apr 24, 2024 | 8:02 AM

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 8:02 AMUpdated Apr 24, 2024 | 8:02 AM
కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ఆ 2 పథకాలు బాగున్నాయ్‌: KCR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మీడియాకు చాలా రోజుల పాటు దూరంగా ఉన్నారు. పైగా అదే సమయంలో ఆయన కింద పడి ఆస్పత్రి పాలవ్వడంతో ఇంటికే పరిమితం అ‍య్యారు. మధ్యలో రెండు సార్లు జనాల్లోకి వచ్చారు. సాగు నీరు లేక అల్లాడుతున్న అన్నదాతలను పరమార్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇక లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. కారును పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యారు కేసీఆర్‌. త్వరలోనే బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు కేసీఆర్‌. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన రెండు పథకాలను ప్రశంసించారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్.. బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతల తీరు ఉందన్నారు. తనను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే.. అసెంబ్లీ సాక్షిగా చెప్పటం విచారకరం అన్నారు కేసీఆర్‌

ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చింది కేసీఆర్‌‌ను తిట్టడానికి కాదని.. వారికి సమర్థవంతమైన పాలన అందించడానికి అన్నారు కేసీఆర్‌. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల్లో చాలా వాటిని ఆపేశారని కేసీఆర్ గుర్తు చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఎవరైనా సరే.. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ఆపేయడని.. వాటిని మరింత ఆకర్షణీయంగా ప్రజలకు అందించేలా కృషి చేస్తాడన్నారు. అంతేకాక తాను అధికారంలోకి వచ్చిన కొత్తలో.. కాంగ్రెస్ అమలు చేసిన పాత పథకాలను తమ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు కేసీఆర్‌.

తమ కన్నా ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ పథకాలను తాము కొనసాగించామని కేసీఆర్‌ తెలిపారు. అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి అధికారులతో చర్చించినప్పుడు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం గురించి అధికారులు చాలా గొప్పగా చెప్పారని.. పైగా ఇది పేదలను ఆదుకునే కార్యక్రమం కనుక.. తమ ప్రభుత్వం దాన్ని కొనసాగించిందన్నారు. అంతేకాక దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం దీనిలో మరి కొన్ని వ్యాధులకు చికిత్సలను ప్రారంభించామని గుర్తు చేశారు.

అలానే విద్యార్థులకు అందించే ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డే ప్రవేశపెట్టారని.. దాన్ని కూడా కొనసాగించాలని అధికారులు సూచిస్తే.. తాము దాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేశామని చెప్పుకొచ్చారు. ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. కానీ వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకుని.. తాము మరింత సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం.. తమ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ భగీరథ పథకాన్ని వాడటం లేదంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.