iDreamPost

కన్నీళ్లు పెట్టిస్తున్న కథ.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి!

కన్నీళ్లు పెట్టిస్తున్న కథ.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి!

గుండెపోటు.. ఇటీవలి కాలంలో ఈ పేరు వింటేనే అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే వయసు, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఇప్పుడు గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరికి, ఎప్పుడు గుండెపోటు వస్తుందో చెప్పే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ గుండెపోటు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇప్పుడు ఈ గుండెపోటు ఒక కుటుంబంలో చీకటి నింపింది. చెట్టంత కొడుకులను బలి తీసుకుని.. తల్లిదండ్రులను అనాథలను చేసింది. వీళ్ల కథ అందరినీ కన్నీల్లు పెట్టిస్తోంది.

ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో జరిగింది. గుండెపోటుతో అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి- అరుణ దంపతులకు శ్రీకాంత్ రెడ్డి(30), మధుసూదన్ రెడ్డి(26) ఇద్దరు కుమారులు. శ్రీకాంత్ రెడ్డి ఫైనాన్స్ కంపెనీలు, మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆగస్టు 3వ తేదీన ఛాతిలో నొప్పి అంటూ మధుసూదన్ ఆస్పత్రిలో చేరాడు. కాసేపటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం మధుసూదన్ రెడ్డి పెద్దకర్మ నిర్వహించారు. ఆ పనులు మొత్తం చూసుకున్న శ్రీకాంత్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత నిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం శ్రీకాంత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు.

కేవలం రోజుల వ్యవధిలోనే ఎదిగొచ్చిన ఇద్దరు కుమారులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కుంగిపోయారు. కన్నకొడుకులు కొరివి పెట్టాల్సింది పోయి.. వాళ్లే కొడుకులకు కొరివి పెట్టాల్సి వచ్చిందని రోదించారు. ఇద్దరు కొడుకులను కని కూడా.. ఎవరూ లేని అనాథలం అయ్యాం అంటూ తల్లిదండ్రులు గుండలెవిసేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నదమ్ముల మృతితో రేణికుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తున్న నేపథ్యంలోనే అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని కోరుతున్నారు. ఛాతిలో నెప్పి వస్తే అశ్రద్ధ చేయద్దంటూ సూచిస్తున్నారు. అధికారులు, వైద్యులు కూడా ప్రజలకు గుండెపోటుపై అవగాహన పెంచుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి