Venkateswarlu
Venkateswarlu
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడుతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడోచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే, తాజా ఘటనలో ఓ ఎలక్ట్రిక్ బైకు రన్నింగ్‌లో ఉండగా రెండు ముక్కలైంది. దాన్ని నడుపుతున్న వ్యక్తి బ్రేకు వేయటంతో ఈ దారుణం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ బైకు కొత్తది కావటంతో విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకోవటం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని మంచిర్యాల, శ్రీరాంపూర్ కాలనీకి చెందిన శ్రావణ్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ బైకు కొన్నాడు. దాదాపు 65 వేల రూపాయలు పెట్టి దాన్ని కొనుగోలు చేశాడు. రెండు రోజుల క్రితం అతడు తన బైకుపై కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లాడు. బైకు రోడ్డుపై వెళుతున్న సమయంలో ఓ చోట బ్రేకు వేశాడు. అంతే.. రన్నింగ్‌లో ఉండగానే బైకు రెండు ముక్కలు అయింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న శ్రావణ్ ఎగిరి నేలపై పడ్డాడు. వెనకాల మరో వాహనం రావటంతో దాని కిందకు అతడి కాళ్లు వెళ్లిపోయాయి. అయితే, అదృష్టం కొద్ది అతడి కాళ్లకు ఏమీ కాలేదు.
ఇది చూస్తున్న అక్కడి జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బైకు గాల్లో ఉండగా రెండు ముక్కలు అవ్వటం ఏంటీ అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటేనే భయంగా ఉంది’’.. ‘‘ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు పేలతాయని మాత్రమే తెలుసు.. ఇప్పుడేంటి ఏకంగా సగానికి విరిగిపోతున్నాయి.. కొనాలంటేనే భయంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, రన్నింగ్‌లో ఉండగా ఎలక్ట్రిక్ బైకు రెండు ముక్కలు అవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.