Krishna Kowshik
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఎంత సంపాదించినా చిన్న అనారోగ్యం వస్తే చాలు ఆ డబ్బు అంతా వైద్యానికే ఖర్చైపోతుంది. అలాగే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అయితే అనారోగ్యానికి దారి తీయడానికి కారణమౌతుంది బయటి ఫుడ్.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఎంత సంపాదించినా చిన్న అనారోగ్యం వస్తే చాలు ఆ డబ్బు అంతా వైద్యానికే ఖర్చైపోతుంది. అలాగే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అయితే అనారోగ్యానికి దారి తీయడానికి కారణమౌతుంది బయటి ఫుడ్.
Krishna Kowshik
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఫుడ్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతుంది. ముఖ్యంగా పట్టణాలు, మెట్రో నగరాల్లో. వండుకునే వారు తక్కువ..తినేవారు ఎక్కువయ్యారు. ఇదే అదునుగా భావించి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఫుడ్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్. జీతంలో సగం ఖర్చు తినడానికి ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా బ్యాచ్ లర్స్ వీటినే ఆశ్రయిస్తుంటారు. అలాగే భార్యా భర్తలు కూడా వీకెండ్ వస్తే చాలు.. వంట గదికి రెస్ట్ ఇచ్చి..హోటల్స్, రెస్టారెంట్లను పెంచి పోషించే పనిలో పడుతుంటారు. అక్కడ ఫుడ్ టేస్ట్ ఉంటే చాలు.. బ్యాగ్రౌండ్ వర్క్ అనవసరం. హోటల్ కాస్త కలర్ ఫుల్‌గా కనిపించి, యాంబియెన్స్ బాగుంటే చాలు.. రేటింగ్స్ ఇచ్చి.. మరో నలుగుర్ని చెడగొడుతున్నారు.
మహానగరం భాగ్యనగరిలో స్ట్రీట్ ఫుడ్ నుండి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు కొదవ లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం దేశ వ్యాప్తంగా నలుమూలలా నుండి ఇక్కడ వస్తుంటారు. వర్క్, ప్రయాణాలతో అలసి సొలసిపోయిన. .ఇంట్లో వండుకోలేక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమే లేదంటే.. సమీపంలో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లి తినేసి వస్తుంటారు. ఆ హోటల్ సూపర్, ఈ రెస్టారెంట్ బంఫర్ అని లొట్టలేసుకుని తింటుంటారు. కానీ ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఫేమస్ హోటల్లో డొల్లతనం బయటకు వచ్చింది. నాణ్యతలేని ఆహార పదార్ధాలను వినియోగిస్తూ కస్టమర్ల జీవితాలతో ఆడుకుంటున్నారని తేలింది. పురుగుల పట్టిన పదార్ధాలు వాడటం, ఎలుకలు తిన్న వస్తువుల, బొద్దింకలు పాకిన పదార్ధాలను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు.
అంతేకాకుండా కల్తీ మాంసం, అవుట్ డేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాడి.. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని సార్లు గడ్డిపెట్టినా ఇది షరా మామూలుగా మారింది. ఓ రెండు రోజులు మంచి ఆహార పదార్ధాలను వినియోగిస్తున్నారు. మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చేస్తుంది. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో బడా హోటల్లో వంటగది శుభ్రంగా లేకపోవడం, నాణ్యత లేని పిండి పదార్థాలు యూజ్ చేయడం, కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం, వాటితోనే వండి కస్టమర్లకు పెడుతున్నారని గుర్తించారు. ఎన్ని చీవాట్లు పెట్టినా హోటల్స్ తీరు మారడం లేదు. మారాల్సింది అవి కాదు.. మనం అనే విషయాన్ని గ్రహించాలి. మన ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన వాళ్లవుతున్నాం. మనం డబ్బులు పెట్టి మరీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామన్న విషయాన్ని గుర్తించి.. హోటల్ ఫుడ్స్ కు కాస్త దూరంగా ఉంటే బెటర్.. ఇదే వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇకనైనా మేల్కోకపోతే ఆరోగ్యం అస్సామే.