రోడ్డు ప్రమాదాల్లో ఒక్కోసారి తెలిసీ తెలియక చేసే చిన్న పొరపాటు కూడా భారీ విషాదాన్ని మిగులుస్తుంది. అందుకే హైవేలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవేల మీద ఒళ్లు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అది పెద్ద వాహనమైనా, చిన్న వాహనమైనా జాగ్రత్త తప్పనిసరి. ఒక బైక్ నడిపే వ్యక్తి చేసిన పొరపాటుకు ఆదిలాబాద్ జిల్లా, మావల-గుడిహత్నూర్ వద్ద ఇలాంటి భారీ ప్రమాదమే చోటుచేసుకుంది. హైవేపై క్రాసింగ్ దగ్గర నిర్లక్ష్యంగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఒక బైకర్ భారీ ప్రమాదానికి గురయ్యాడు.
అకస్మాత్తుగా వచ్చిన బైకును గమనించిన కంటెయినర్ డ్రైవర్.. ఆ బైక్ మీద ఉన్న ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు బండిని ఎడమ వైపునకు తిప్పాడు. దీంతో బైకును తప్పించాడు. కానీ డివైడర్‌ను ఢీకొనడంతో భారీ శబ్దం చేస్తూ ట్రక్కు కాస్త దూరంలో వెళ్లి బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్లో ట్రక్కు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న వాళ్లు మాత్రం చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ట్రక్కు ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ట్రక్కు యాక్సిడెంట్ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
నేరడిగొండ మండలం, చించోలీకి చెందిన జంగు, కృష్ణ, సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులు మావల మండలానికి వచ్చారు. మండలంలోని వాఘాపూర్‌లో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇంటికి తిరిగెళ్లే క్రమంలో సీతాగోంది దగ్గర్లోని వాఘాపూర్ క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ హైవేపై రోడ్డు దాటేందుకు బైక్‌ను మళ్లించారు. అదే టైమ్‌లో అటుగా వేగంగా వచ్చింది కంటెయినర్. కానీ దాన్ని గమనించకుండా బైకును అలాగే ముందుకు పోనిచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ బైక్‌ను గమనించి.. వాహనాన్ని ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. దీంతో ఆ లారీ బోల్తా పడింది. కంటెయినర్‌ను నడుపుతున్న డ్రైవర్ రషీద్ ఖాన్‌కు తీవ్ర గాయాలవ్వగా.. క్లీనర్ ఆబిద్ ఖాన్ స్వల్పంగా గాయపడ్డాడు. వారిద్దర్నీ ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చి, చికిత్స చేయిస్తున్నారు.
Implications of Abrupt lane change & Over Speeding at Intersections.
Adilabad, 06.08.2023. pic.twitter.com/3hd3vbwhmQ— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 7, 2023