గుడ్‌న్యూస్‌: ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచిన ప్రభుత్వం!

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అనారోగ్యం సమయంలో రోగులకు ఎంతగానో మేలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమాలోచనలు చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిమితి 2 లక్షల రూపాయలుగా ఉంది. ఈ 2లక్షల రూపాయల పరిమితి సరిపోవటం లేదంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు అందాయి. దీంతో సీఏం ఆరోగ్యశ్రీ పరిమితిపై మీటింగ్‌ నిర్వహించారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సభ్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహణను నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తీర్మానించారు.

కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో 856 బ్లాక్‌ పంగస్‌ సర్జరీలు సక్సెస్‌ ఫుల్‌గా చేసి ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌కు 1 కోటి 30 లక్షల రూపాయల అదనపు ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించారు. బయోమెట్రిక్‌ విధానం వల్ల ఆరోగ్యశ్రీ రోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వారి కోసం ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది. అంతేకాదు! ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించనుంది. మరి, తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments